zycov-d: త్వరలో జైడస్‌ టీకాకు అనుమతులు

గుజరాత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్‌ క్యాడెల్లా అభివృద్ధి చేసిన కొవిడ్‌19 టీకా జైకోవ్‌-డీకు త్వరలోనే ఔషధ నియంత్రణ విభాగం నుంచి అనుమతులు మంజూరుకానున్నాయి.

Published : 12 Jul 2021 21:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గుజరాత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్‌ క్యాడెల్లా అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 టీకా జైకోవ్‌-డీకు త్వరలోనే ఔషధ నియంత్రణ విభాగం నుంచి అనుమతులు మంజూరుకానున్నాయి. ఇది డీఎన్‌ఏ ఆధారంగా తయారైన తొలి కొవిడ్‌ టీకా. జులై 1వ తేదీన కంపెనీ అత్యవసర అనుమతుల కోసం దరఖాస్తు చేసుకొంది. 12ఏళ్లకు పైబడిన వారిపై తమ టీకా పని చేస్తుందని వెల్లడించింది. ఈ మేరకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు దరఖాస్తు చేసుకొంది. దీంతోపాటు 28వేల మందిపై చేసిన ప్రయోగాల మధ్యంతర ఫలితాల నివేదికను అందజేసింది. 

దీనికి అనుమతులు వస్తే రెండో భారతీయ టీకాగా నిలుస్తుంది. జైకోవ్‌-డీ మూడు డోసుల టీకా. జైడస్‌ క్యాడెల్లా చెప్పినదాని ప్రకారం ఈ టీకాను 0-28-56 రోజుల్లో తీసుకోవాలి. రెండు డోసుల టీకాపై కూడా పనిచేస్తున్నట్లు జైడస్‌ వెల్లడించింది. 

ఏటా 24 కోట్ల తయారీకి సన్నాహాలు..

టీకాకు అనుమతులు వచ్చాక ఉత్పత్తిని ఏటా 24 కోట్ల డోసులకు పెంచాలని జైడస్‌ భావిస్తున్నట్లు కంపెనీ ఎండీ డాక్టర్‌ షర్విల్‌ పటేల్‌ పేర్కొన్నారు. జూన్‌లో ఇందుకు అవసరమైన ముడిపదార్థాలను ప్లాంట్లకు సరఫరా చేయడం మొదలుపెట్టారు. తొలుత నెలకు కోటి డోసులను ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాత దీనిని రెండు కోట్లకు పెంచనున్నారు. దీంతోపాటు ఇప్పటికే 12-17 ఏళ్ల వారిపై కూడా ప్రయోగ పరీక్షలు చేశారు. దీంతో ఈ టీకా పిల్లలు, కౌమారదశలోని వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని