అందుకే చైనాపై మా అనుమానాలు: పాంపియో

కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో తొలి నుంచి చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పాలక వర్గం తాజాగా మరోసారి తీవ్ర స్థాయి ఆరోపణలు చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో మాట్లాడుతూ........

Published : 16 Jan 2021 11:18 IST

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో తొలి నుంచి చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పాలక వర్గం తాజాగా మరోసారి తీవ్ర స్థాయి ఆరోపణలు చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో మాట్లాడుతూ.. చైనాను అనుమానించడానికి తమ వద్ద కారణాలు ఉన్నాయని తెలిపారు. 2019 సెప్టెంబరులోనే వుహాన్‌లోని వైరాలజీ ప్రయోగశాలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు కరోనా లక్షణాలు బయటపడ్డాయని ఆరోపించారు. చైనాలో అధికారికంగా తొలి కేసును నిర్ధారించడానికి ముందే ఇది జరిగిందని పేర్కొన్నారు. మహమ్మారి మూలాలపై పరిశోధనలు జరిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిపుణులు బృందం వుహాన్‌లో పర్యటిస్తున్న సందర్భంలో పాంపియో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

చైనా ఇప్పటికీ కీలక సమాచారాన్ని దాచిపెడుతోందని పాంపియో ఆరోపించారు. వైరస్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పంచుకునేలా చైనా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందానికి సూచించారు. యావత్తు ప్రపంచాన్ని కరోనా నుంచి రక్షించాలంటే చైనా వద్ద ఉన్న పూర్తి సమాచారం బయటకు రావాల్సిందేనని పేర్కొన్నారు. భవిష్యత్తు మహమ్మారుల్ని అరికట్టడంలో ఇది కీలక పాత్ర పోషించనుందన్న డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయాన్ని ఆయన సమర్థించారు.

2019 చివర్లో తొలిసారి కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ మహమ్మారి 20 లక్షల మంది ప్రాణాల్ని బలిగొంది. అయితే, వుహాన్‌లోని వైరాలలీ ల్యాబ్‌ నుంచే ఈ వైరస్ లీకయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటిని చైనా కొట్టిపారేసింది. ల్యాబ్‌లో ఏ ఒక్కరూ మహమ్మారి బారిన పడలేదని తెలిపింది. మరోవైపు ఈ మహమ్మారి ప్రపంచం మొత్తం వ్యాపించడానికి చైనా తీరే కారణమని అమెరికా ఆరోపిస్తూ వస్తోంది. ట్రంప్ పాలక వర్గం చివరి రోజుల్లోనూ అవే ఆరోపణల్ని కొనసాగిస్తోంది.

ఇవీ చదవండి..

20లక్షలు దాటిన కరోనా మరణాలు!

ఇలా వైరస్‌ను గుర్తిస్తుంది.. అలా దాడి చేస్తుంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని