
నిర్భయ దోషులకు ఉరి
శిక్ష నిలుపుదలకు చివరి వరకు విఫలయత్నాలు
దిల్లీ: ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు చివరి క్షణం వరకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. వారు దాఖలు చేసిన పిటిషన్లంటినీ న్యాయస్థానాలు కొట్టివేశాయి. దీంతో దోషులైన ముకేశ్ సింగ్ (32), పవన్ గుప్త (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)లను తిహార్ జైలులో ఉరి తీశారు. పలువురు జైలు అధికారులతోపాటు, జిల్లా మెజిస్ట్రేట్ సమక్షంలో ఇవాళ ఉదయం 5.30 గంటలకు జైలు నంబరు 3లో ఒకేసారి నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేశారు. తలారి పవన్ జల్లాద్ ఉరిశిక్ష ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సమయంలో 17 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. నిర్భయ దోషుల ఉరితీతను వైద్యులు ధ్రువీకరించారు. నలుగురూ మరణించినట్లు వెల్లడించారు.
అంతకుముందు గురువారం విచారణ సమయంలో నేరం జరిగినప్పుడు తాను దిల్లీలో లేనంటూ దోషి ముకేశ్ సింగ్ చేసిన వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. చట్టపరమైన అన్ని అవకాశాలు మూసుకుపోయాయని, ఈ దశలో కొత్త వాదనలకు అవకాశం లేదని జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తాను సమర్పించిన రెండో క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఇంకో దోషి అక్షయ్ కుమార్ పెట్టుకున్న దరఖాస్తును కూడా ఇదే ధర్మాసనం తిరస్కరించింది. మరో నిందితుడు పవన్ కుమార్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ను జస్టిస్ ఎన్.వి.రమణ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల ధర్మాసనం తిరస్కరించింది.
మరోవైపు ఉరిశిక్షను అమలు చేయాలన్న పటియాలా హౌస్కోర్టును తీర్పును సవాలు చేస్తూ.. అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్త, వినయ్ శర్మలు వెంటనే దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వీరికి ఎదురుదెబ్బే తగిలింది. పటియాలా హౌస్ కోర్టు తీర్పును సమర్థిస్తూ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంజీవ్ల ద్విసభ్య ధర్మాసనం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో తీర్పు వెలువరించింది. యథాతథంగా ఉరి శిక్ష అమలు చేయాలని తేల్చి చెప్పింది. దీంతో నిర్భయ దోషులు అర్ధరాత్రి దాటిన తర్వాత మళ్లీ సుప్రీం తలుపులు తట్టారు. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం సదరు పిటిషన్ను కొట్టివేసింది. ఉరిని యథాతథంగా అమలు చేయాలని తీర్పునిచ్చింది.
ఇవీ చదవండి:
దోషుల పూర్వాపరాలు ఇవే..
నిర్భయ దోషుల చివరి క్షణాలు ఇలా..
ఏడ్చా.. బాధపడ్డా.. భయపడ్డా.. పోరాడా..
నా కుమార్తెకు న్యాయం జరిగింది: నిర్భయ తల్లి