Covid: ప్రాణాంతక హ్యాపీ హైపోక్సియా

ప్రస్తుతం కరోనా సోకిన కొందరిలో ఆక్సిజన్‌ శాతం పడిపోయినా.. శ్వాసలో ఎలాంటి ఇబ్బందులు ఉండటంలేదు. వీరిలో కొందరు కొంత అలసటకు గురయ్యే పనిచేసినా అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోతున్నారు. దీన్నే వైద్య పరిభాషలో హ్యాపీ హైపోక్సియా అంటున్నారు....

Published : 23 Jun 2021 23:20 IST

జాగ్రత్తలు అవసరమంటున్న వైద్య నిపుణులు

కరోనా రెండోదశ ఎక్కువగా యువతను బలి తీసుకుంటోంది. స్వల్ప లక్షణాలే ఉండి.. అప్పటివరకు ఆరోగ్యంగా, చలాకీగా ఉన్నవారు సైతం ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందుతున్నారు. వీరిలో ఎక్కువ మంది మరణానికి కారణం ‘హ్యాపీ హైపోక్సియా’. వైద్య పరిభాషలో సైలెంట్‌ హైపోక్సియాగా పిలిచే ఈ లక్షణం నిజంగానే ఓ సైలెంట్‌ కిల్లర్‌.

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం కరోనా సోకిన కొందరిలో ఆక్సిజన్‌ శాతం పడిపోయినా.. శ్వాసలో ఎలాంటి ఇబ్బందులు ఉండటంలేదు. వీరిలో కొందరు కాస్త అలసటకు గురయ్యే పని చేసినా అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోతున్నారు. దీన్నే వైద్య పరిభాషలో హ్యాపీ హైపోక్సియా అంటున్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. వైరస్‌ కలిగించే ఇన్‌ఫ్లమేషన్‌ రియాక్షన్‌ వల్ల ఊపిరితిత్తుల నుంచి రక్తం సరఫరా చేసే సన్నటి రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా ఊపిరితిత్తులు దెబ్బతినడం, రక్తనాళాల్లోని గడ్డలతో ఆక్సిజన్‌ను శోషించుకునే గుణం తగ్గుతోంది.

ఇక రెండో కారణం.. రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గినప్పుడు దాన్ని గాలి నుంచి ఎక్కువగా గ్రహించేందుకు మనిషి అసంకల్పితంగానే చాలాసార్లు ఊపిరి తీసుకుంటాడు. ఆ క్రమంలో రక్తంలో ఉండే కార్బన్‌డయాక్సైడ్‌ ఎక్కువగా బయటకు వెళ్లిపోతుంది. సాధారణంగా రక్తంలో కార్బన్‌డయాక్సైడ్‌ 40 మిల్లీమోల్స్‌ ఉండాలి. మనిషి మెదడులో శ్వాసకోశ వ్యవస్థను నియంత్రించే భాగాన్ని స్టిమ్యులేట్‌ చేసేది కార్బన్‌డయాక్సైడే. అది ఉండాల్సిన దానికంటే తగ్గిపోవడం వల్ల మనిషి మెదడులో స్టిమ్యులేషన్‌ జరగక.. రక్తంలో ఆక్సిజన్‌ శాతం బాగా తగ్గిపోతుంది.

కరోనా మొదటి దశలో హ్యాపీ హైపోక్సియా లక్షణం ఉన్నవారు ఆక్సిజన్‌ శాతం 98 ఉన్నప్పుడు ఎలా ఉండేవారో, 90కి పడిపోయినప్పుడు కూడా అలాగే ఉండేవారు. ఇప్పుడు 80 నుంచి 85 శాతం కంటే పడిపోయినా సాధారణంగానే ఉంటున్నారు. వారిలో వ్యాధి లక్షణాలు పెద్దగా కనిపించడంలేదు. దీంతో హఠాత్తుగా నష్టం జరుగుతోంది. టాయ్లె‌ట్‌కు వెళ్లడం, వేగంగా మెట్లు ఎక్కడం, బరువులు ఎత్తడం, బైక్‌ మీద వెళ్లడం.. ఇలా కాస్త ఒత్తిడి, ఆయాసం కలిగించే పనులు చేస్తే ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. కాబట్టి కరోనా లక్షణాలుంటే ఎప్పటికప్పుడు పల్స్‌ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్‌ శాతాన్ని పరీక్షించుకోవాలి. 94 శాతం కంటే తగ్గితే జాగ్రత్తపడాలి. టాయ్‌లెట్‌కు వెళ్లినప్పుడు ఆయాసంగా అనిపించడం, పెదవులు నీలం రంగులోకి మారడం, చల్లటి వాతావరణంలోనూ చెమటలు పట్టడం వంటివన్నీ హ్యపీ హైపోక్సియా లక్షణాలే.  ఇలాంటివి కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.


Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts