
UP Polls: ఐటీ రంగంలో యువతకు22లక్షల ఉద్యోగాలు: అఖిలేశ్ హామీ
లఖ్‌నవూ: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటేసి గెలిపిస్తే 22లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హామీ ఇచ్చారు. శనివారం లఖ్‌నవూలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే ఐటీ రంగంలో యువతకు శిక్షణ కల్పించి ఉద్యోగాలు కల్పించే దిశగా తమ పార్టీ కృషి చేస్తుందన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఐటీ రంగంలో చేసిన కృషిని ఈ సందర్భంగా అఖిలేశ్ ప్రస్తావించారు. ఐటీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేసిందన్నారు. రాష్ట్రంలోని చక్ గజారియా ఫామ్‌లో హెచ్‌సీఎల్ తొలిసారి పెట్టుబడులు పెట్టిందనీ.. తమ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను ముందుకు తీసుకెళ్లి ఉంటే లఖ్‌నవూ ఐటీ హబ్‌గా గుర్తింపు పొంది ఉండేదన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏమీ చేయలేదని ఆరోపించారు. హెచ్‌సీఎల్ క్యాంపస్‌లో 5వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారనీ.. మరికొంత మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నట్టు చెప్పారు.
కర్హాల్ నుంచే అఖిలేశ్ పోటీ
అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ తొలిసారి రంగంలోకి దిగుతున్నారు. మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ సీటు నుంచి పోటీ చేస్తారంటూ సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు, కాంగ్రెస్ మాజీ ఎంపీ పర్విన్ సింగ్ అరోన్, ఆయన సతీమణి సుప్రియా సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. అఖిలేశ్ యాదవ్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సుప్రియాకు కాంగ్రెస్ బరేలీ కంటోన్మెంట్ సీటు ఖరారు చేయగా.. ఇప్పుడు ఆమె అదే సీటు నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగనుండటం గమనార్హం. అయితే, ఇప్పటికే ఈ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ రాజేశ్ అగర్వాల్ పేరును ప్రకటించినప్పటికీ ఆ సీటును సుప్రియకు కేటాయించింది.