Andhra News: దూసుకొస్తున్న మాండూస్‌ తుపాను.. అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ ఆదేశం

మాండస్‌ తుపాను నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ జవహర్‌రెడ్డి సూచించారు. వెలగపూడిలోని సచివాలయం నుంచి తుపాను ముందు జాగ్రత్త చర్యలపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

Updated : 14 Dec 2022 11:01 IST

అమరావతి: అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్‌  తుపాను దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు తీరాలవైపు వేగంగా దూసుకొస్తోందని ఐఎండీ తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం తమిళనాడులోని కరైకాల్‌కు 500 కిలోమీటర్లు, చెన్నైకి580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ జవహర్‌రెడ్డి సూచించారు. వెలగపూడిలోని సచివాలయం నుంచి తుపాను ముందు జాగ్రత్త చర్యలపై తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. మాండస్‌ తుపాను ఈనెల 9వ తేదీ అర్ధరాత్రికి పుదుచ్చేరి, మహా బలిపురం, శ్రీహరికోట మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఈనెల 10 వరకూ రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

ఆయా జిల్లాల కలెక్టర్లు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్‌ ఆదేశించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లాలో ఒకటి, నెల్లూరు జిల్లాలో 2, తిరుపతి జిల్లాలో ఒకటి, చిత్తూరులో ఒకటి.. మొత్తం 5 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించాలన్నారు. భారీ వర్షాలతో ఎక్కడైనా రహదారులకు ఇతర కమ్యూనికేషన్‌ వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తితే సత్వర చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు భూసేకరణపైనా కలెక్టర్లతో సీఎస్‌ సమీక్షించారు. రాష్ట్రానికి కొత్తగా మంజూరైన విజయవాడ-కడప-బెంగళూరు జాతీయ రహదారి, అనంతపురం-గుంటూరు జాతీయ రహదారి, విశాఖపట్నం-బోగాపురం-రాయపూర్  ఆరు వరసల జాతీయ రహదారి సహా ఇతర ప్రాజెక్టులపై అరా తీశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు