iPhone Battery: ఐఫోన్ ఛార్జింగ్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు యాపిల్ కొత్త సాంకేతికత

ఐఫోన్‌లో బ్యాటరీ ఛార్జింగ్‌ కష్టాలకు చెక్ పెట్టేందుకు యాపిల్‌ కంపెనీలో త్వరలో కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో ఐఫోన్ బ్యాటరీ పనితీరు మెరుపడి ఛార్జింగ్ ఎక్కువసేపు ఉంటుందని టెక్ వర్గాలు తెలిపాయి. 

Published : 01 Sep 2021 23:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆండ్రాయిడ్ ఫోన్‌, ఐఫోన్‌ రెండింటిలో దేనికి ఓటు అంటే ఎక్కువ మంది వినియోగదారులు మొగ్గు చూపేది ఐఫోన్‌కే. కానీ కొనుగోళ్లు పరంగా చూస్తే మాత్రం ఆండ్రాయిడ్ ఫోన్లకే డిమాండ్ ఎక్కువ. దీనికి ప్రధాన కారణం ఐఫోన్‌తో పోలిస్తే ఆండ్రాయిడ్ ఫోన్లు తక్కువ ధరకే లభిస్తాయి. అలానే ఫీచర్లు కూడా ఐఫోన్‌ కంటే ఆండ్రాయిడ్ ఫోన్‌లోనే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బ్యాటరీ విషయంలో యాపిల్ ఫోన్‌కి, ఆండ్రాయిడ్‌ ఫోన్‌కి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. దీంతో యాపిల్‌ కంపెనీ ఐఫోన్లలో బ్యాటరీ లైఫ్‌ని మెరుగుపరిచేందుకు ‘అటెన్షన్‌ డిటెక్షన్ సర్వీస్‌’ పేరుతో కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన పేటెంట్‌ను యాపిల్‌ ఇటీవలే పొందినట్లు తెలుస్తోంది.

దీని సాయంతో యూజర్‌ ఫోన్‌ ఉపయోగించే తీరును గుర్తించి తదనుగుణంగా బ్యాటరీ పనితీరులో మార్పులు చేస్తుంది. చాలా మంది యూజర్స్ నోటిఫికేషన్ అటెన్షన్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటారు. కానీ వాటిపై పెద్దగా దృష్టి సారించరు. దీనివల్ల నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారీ బ్యాటరీ కొంత శాతం ఖర్చయి ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది. అయితే అటెన్షన్ డిటెక్షన్‌ సర్వీస్‌ సాయంతో యూజర్‌ ఫోన్ ఉపయోగించే తీరును సెన్సర్ల సాయంతో నమోదు చేస్తుంది. ఉదాహరణకు చాలా సేపు మీరు ఫోన్ స్క్రీన్‌ను చూడటంలేదనుకుందాం.. అప్పుడు ఈ కొత్త సాంకేతికత ఆ వివరాలను నమోదు చేసుకుని ఆ సమయంలో ఫోన్‌కి బ్యాటరీ నుంచి తక్కువ ఛార్జింగ్ అందేలా చేస్తుంది. దాంతో బ్యాటరీ ఛార్జింగ్ ఆదా అవుతుందని టెక్‌ వర్గాలు తెలిపాయి. 

ఈ కొత్త సాంకేతికతలో టచ్‌ స్క్రీన్‌, బయోమెట్రిక్‌, డివైజ్‌ డైనమిక్‌ సెన్సర్‌, కెమెరా, ప్రాసెసింగ్ సిస్టం, బటన్ సెన్సర్‌, హ్యాప్టిక్ సెన్సర్‌, కీబోర్డ్‌, ఎక్స్‌టర్నల్ కనెక్షన్ సెన్సర్‌, మౌస్ పాయింటింగ్ సెన్సర్‌ల నుంచి డేటాను సేకరించి దాన్ని క్రోడీకరిస్తుంది. దాంతో యూజర్‌ ఫోన్ ఉపయోగించే విధానంపై ఒక అంచనాకు వచ్చి.. ఫోన్‌కు అవసరమైన పవర్‌ను మాత్రమే అందిస్తుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను ఐఫోన్ 13 తర్వాత రాబోయే మోడల్స్‌లో పరిచయం చేయనున్నారట. 

అలానే సెప్టెంబరు రెండో వారంలో విడుదలకానున్న ఐఫోన్ 13 మోడల్‌లో మెరుగైన బ్యాటరీని యాపిల్‌ పరిచయం చేయనుందని సమాచారం. ముఖ్యంగా ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్‌ మోడల్స్‌లో బ్యాటరీ మెరుపరిచినట్లు తెలుస్తోంది. ఈ మోడల్స్‌లో 120 హెర్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో ప్రో మోషన్‌ స్క్రీన్‌ను ఇస్తున్నారు. దీనికి అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ అవసరం. ఐఫోన్ 13 మినీలో 2,406 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ 13, 13 ప్రో వేరియంట్లో 3,095 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ 13 ప్రో మాక్స్‌లో 4,352 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇది 25 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుందట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు