Apple Update: యాపిల్‌ కొత్త అప్‌డేట్‌.. పిల్లల రక్షణకా.. నిఘా కోసమా..?

పిల్లలపై జరుగున్న లైంగిక వేధింపులు కట్టడికి ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఐఫోన్, ఐపాడ్‌లలో చైల్డ్‌ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (సీఎస్‌ఏఎం)ను గుర్తించేందుకు ‘న్యూరల్ మ్యాచ్‌’ అనే కొత్త టూల్‌ను అభివృద్ధి చేసినట్లు యాపిల్ ప్రకటించింది. ఇది మెషీన్ లెర్నింగ్ సాంకేతికతతో పనిచేస్తుంది...

Published : 06 Aug 2021 22:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పిల్లలపై జరుగున్న లైంగిక వేధింపులు కట్టడికి ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఐఫోన్, ఐపాడ్‌లలో చైల్డ్‌ సెక్సువల్ అబ్యూజ్‌ మెటీరియల్ (సీఎస్‌ఏఎం)ను గుర్తించేందుకు ‘న్యూరల్ మ్యాచ్‌’ అనే కొత్త టూల్‌ను అభివృద్ధి చేసినట్లు యాపిల్ ప్రకటించింది. ఇది మెషీన్ లెర్నింగ్ సాంకేతికతతో పనిచేస్తుంది. దీని సాయంతో పిల్లలకు సంబంధించిన అభ్యంతరకర ఫొటోలు యాపిల్ డివైజ్‌లు లేదా ఐక్లౌడ్‌లో ఉంటే ఈ సాఫ్ట్‌వేర్ గుర్తించి సంబంధిత అధికారులకు చేరవేస్తుంది. అలానే యాపిల్‌ డివైజ్‌ల నుంచి పిల్లల అశ్లీల ఫొటోలు షేర్ చేస్తుంటే హెచ్చరికలు జారీ చేస్తుంది. అయినప్పటికీ షేర్ చేస్తే వాటి గురించిన సమాచారం అధికారులకు చేరవేస్తుందని యాపిల్ తెలిపింది.

కానీ ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో ప్రభుత్వాలు పౌరులపై నిఘా ఉంచి వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అవకాశం ఉందని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాపిల్ మాత్రం ఈ వాదన తప్పని అంటోంది. న్యూరల్ మ్యాచ్‌ యూజర్ డేటాను ఎంత మాత్రం సేకరించదని మెషీన్ లెర్నింగ్ సాయంతో కేవలం సీఎస్‌ఏఎంను మాత్రమే గుర్తిస్తుందని తెలిపింది. దీనివల్ల యూజర్ వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని వెల్లడించింది. ‘‘కొన్నిసార్లు యాపిల్ అల్గారిథమ్‌ను తప్పదోవ పట్టించేందుకు సీఎస్‌ఏఎంను పోలిన ఫొటోలను హ్యాకర్స్ ఇతరుల డివైజ్‌లలోకి పంపివచ్చు. దానివల్ల అమాయకులు చట్టపరమైన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అంతేకాకుండా యూజర్‌ వ్యక్తిగత గోప్యతకు ఇది భంగం కలిగించవచ్చు’’ అని అమెరికాకు చెందిన మాథ్యూ గ్రీన్ అనే సైబర్ నిపుణుడు అభిప్రాయపడ్డాడు.

యూజర్‌ వ్యక్తిగత గోప్యతకు అధిక ప్రాధాన్యమిస్తూ ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను యాపిల్ తొలుత పరిచయం చేసింది. అలానే యాపిల్ డివైజ్‌లలో నిక్షిప్తమయిన డేటాను యూజర్ మినహా ఇతరులు చూడలేరు. అయితే చట్టపరమైన అంశాలలో యాపిల్ డివైజ్‌ల నుంచి డేటా పొందండం పోలీసులు, దర్యాప్తు సంస్థలకు సమస్యగా మారింది. దీంతో అవసరమైనప్పుడు యూజర్ డేటా పొందేలా దర్యాప్తు సంస్థలకు సహకరించాలని చాలా కాలంగా యాపిల్‌ను ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో న్యూరల్ మ్యాచ్ ద్వారా పరోక్షంగా యూజర్ డేటాను ప్రభుత్వ సంస్థలు పొందగలుగుతాయని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికతను అమెరికాలో ప్రవేశపెట్టనున్నారు. తర్వాత మిగిలిన దేశాల్లో అమలుచేయనున్నట్లు తెలుస్తోంది.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని