
Ashleigh Barty : ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత..ఆష్లే బార్టీ
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే బార్టీ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన తుదిపోరులో ఆమె అమెరికాకు చెందిన డానియెలీ రోజ్ కొలిన్స్‌ను ఓడించింది. 6-3, 7-6 పాయింట్లతో వరుస సెట్లలో విజయం సాధించింది. రెంటో సెట్లో ఓ దశలో 1-5 తో వెనుకబడిపోయిన బార్టీ గొప్పగా పుంజుకుంది. కొలిన్స్ చేసిన అనవసర తప్పిదాలను సద్వినియోగం చేసుకుంది. వరుసగా రెండు బ్రేక్ పాయింట్లు సాధించి పోటీలోకి వచ్చింది. దీంతో తన కెరీర్లో తొలిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించింది. దీంతో సంచలన ప్రదర్శనతో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరిన అమెరికా అమ్మాయి డానియెలీ కొలిన్స్కి తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నిరాశే ఎదురైంది. ఇంతకు ముందు బార్టీ రెండు గ్రాండ్‌స్లామ్‌లు (2021 వింబుల్డన్, 2019 ఫ్రెంచ్ ఓపెన్) నెగ్గినా.. తన స్వదేశంలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను సొంతం చేసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. దీంతో 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన రెండో ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా బార్టీ చరిత్ర సృష్టించింది. 1978లో చివరిసారి ఆస్ట్రేలియా ప్లేయర్ క్రిస్టినా ఓనీల్ టైటిల్ సాధించింది.