Updated : 04 Apr 2022 05:33 IST

Ukraine Crisis: కీవ్‌కు అడ్డుగోడగా ‘బుచ్చా’..!

 రష్యా సైనికుల విధ్వంసాన్ని తట్టుకొని నిలిచిన నగరం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో 35వేల మంది జనాభా ఉన్ననగరం బుచ్చాపై ఆధిపత్యం కోసం రష్యా దళాలు భీకరపోరు జరిపాయి. మార్చి 31న ఈ ప్రాంతాన్ని ఉక్రెయిన్‌ దళాలు తిరిగి స్వాధీనం చేసుకొన్నాయి. ఈ ప్రదేశంలోకి ఇటీవల ప్రవేశించిన జర్నలిస్టులకు అక్కడి దృశ్యాలను చూశాక గుండె పగిలిపోయింది. బుచ్చా వీధుల్లో శవాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఓ వ్యక్తి కారులో ప్రయాణిస్తూ తీసిన వీడియోలో దాదాపు 20 వరకు మృతదేహాలు వీధుల్లో కనిపించాయి. వీటిల్లో ఓ పసిబిడ్డ మృతదేహం కూడా ఉంది. ఇక ఆ నగర వీధులు ధ్వంసమైన రష్యా యుద్ధ ట్యాంకులతో బీభత్సంగా మారిపోయాయి. ఆ ప్రాంతంలో తీసిన ఓ వీడియోను ఉక్రెయిన్‌ రక్షణశాఖ ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేసింది.

మొదటి నుంచి భీకర పోరు..

ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైన తర్వాత రష్యా సేనలు కీవ్‌ దిశగా వేగంగా వచ్చాయి. కానీ, వీటికి తొలి ప్రతిఘటన బుచ్చాలో ఎదురైంది. ఇక్కడ ఉక్రెయిన్‌ దళాలు రష్యా సైనిక కాన్వాయ్‌పై ఎదురుదాడి చేశాయి. యుద్ధం తొలినాళ్లలో రష్యా దళాలపై ఎదురుదాడి చేసిన అతికొద్ది ఘటనల్లో ఇది కూడా ఒకటి. ఈ దాడిలో రష్యా కాన్వాయ్‌ మొత్తం ధ్వంసమైంది. కీవ్‌ చుట్టుపక్కల అత్యంత భీకర పోరు జరిగిన ప్రాంతం ఇదే అని అధికారులు చెబుతున్నారు.

యుద్ధం మొదలైన తొలి రోజు హోస్ట్‌మాల్లోని యాంటోనోవ్‌ ఎయిర్‌ పోర్టుపై పట్టు సాధించేందుకు రష్యా సేనలు భీకర దాడులు చేశాయి. తొలిరోజు దాడిలో వారి ప్రయత్నాలు విఫలం కాగా.. రెండో రోజు చేపట్టిన దాడిలో ఆ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన యాంటోనోవ్ విమానం ధ్వంసమైంది. కీవ్‌ను చుట్టుముట్టేందుకు వీలుగా బుచ్చాను స్వాధీనం చేసుకోవడానికి భారీ ఎత్తున రష్యా సైనిక దళాలు వచ్చాయి. వీటిల్లో పారాట్రూపర్లు, 36వ కంబైన్డ్‌ ఆర్మ్స్‌ఆర్మీ, స్పెషల్‌ ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ యూనిట్‌, స్పెషల్‌ పర్పస్‌ మొబైల్‌ యూనిట్‌, నేషనల్‌ గార్డ్‌ ఆఫ్‌ రష్యా బలగాలు ఉన్నాయి. ఈ క్రమంలో రష్యా దళాలు అక్కడి భవనాలపై నిర్దయగా శతఘ్నులతో కాల్పులు జరిపాయి.

బుచ్చా నుంచి కీవ్‌ వైపు వెళ్లే మార్గంలో ఓ చోట రోడ్డు  ఇరుకుగా.. పొడవుగా ఉంది. ఇది ఉక్రెయిన్‌ దళాలకు మాటువేసి ప్రత్యర్థిపై దాడి చేయడానికి అత్యంత అనుకూలమైన ప్రదేశం. అప్పటికే అక్కడ ఉన్న ఉక్రెయిన్‌ వాలంటీర్లు, టర్కీ నుంచి తెప్పించిన బైరక్తర్‌ సాయుధ డ్రోన్ల సాయంతో రష్యా కాన్వాయ్‌పై భారీగా దాడి చేసి ధ్వంసం చేశాయి. ఈ దాడిలో 100 యూనిట్ల రష్యా సాయుధ సామగ్రి ధ్వంసమైంది. ఆ కాన్వాయ్‌లో ఉన్న  కాన్‌స్క్రిప్ట్‌ (నిర్బంధంగా సైన్యంలో చేరిన వారు) దళాలు ప్రాణాలను కాపాడుకోవడానికి వాహనాలను వదిలి చుట్టుపక్కల ఇళ్లల్లో ఆశ్రయం కోసం ప్రాధేయపడ్డారని ఓ ప్రత్యక్ష సాక్షి ఆంగ్లపత్రికకు వెల్లడించారు. వారంతా 18-20 ఏళ్ల లోపువారే అని తెలిపారు. బుచ్చా-ఇర్పిన్‌ ప్రాంతల మధ్య ఉన్న ఓ వంతెనను కూడా ఉక్రెయిన్‌ దళాలు పేల్చేశాయి. దీంతోపాటు  స్పెషల్‌ పర్పస్‌మొబైల్‌ యూనిట్‌ కీలక అధికారిని ఉక్రెయిన్‌ దళాలు మట్టుబెట్టడంతో రష్యా దళాలు ముందుకుసాగడం నిలిచిపోయింది. మార్చి 3వ తేదీన బుచ్చాపై తిరిగి పట్టు సాధించినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. పట్టువదలని రష్యా సేనలు ఈ నగరంపై దాడులను కొనసాగించాయి. మార్చి 6వ తేదీ నుంచి దాడులను తీవ్రతరం చేశాయి. రెండు రోజుల్లోనే ఇక్కడి ప్రధాన హైవేలు రష్యా చేతిలోకి వెళ్లిపోయాయి. 12వ తేదీ నాటికి రష్యన్లు ఈ ఊరిపై పూర్తి పట్టు సాధించారు. ఆ మర్నాడే రష్యన్ల శతఘ్ని దాడుల్లో మరణించిన 67 మందిని సామూహిక ఖననం చేశారు. దీంతో కీవ్‌ను రక్షించుకొనేందుకు ఉక్రెయిన్‌ సేనలు.. రష్యా సేనలు ఇర్పిన్‌ నదిని దాటకుండా చూడటమే ప్రథమ కర్తవ్యంగా భావించాయి. బుచ్చాలో రష్యా సేనలు ఇళ్లు, దుకాణాలను కొల్లగొట్టినట్లు  ఉక్రెయిన్‌ అధికారులు ఆరోపించారు.

కీవ్‌, చర్నీహివ్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో దళాల కార్యకలాపాలు తగ్గిస్తామని మార్చి 29న రష్యా డిప్యూటీ డిఫెన్స్‌ మినిస్టర్‌ ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్‌ దళాలు ఎదురు దాడులు చేస్తూ బుచ్చాలోకి ప్రవేశించాయి. మార్చి 31 నాటికి ఈ ప్రాంతాన్ని ఉక్రెయిన్‌ సేనలు తిరిగి పూర్తిగా స్వాధీనం చేసుకొన్నాయి. 

రెండు చోట్ల.. 270 మంది ఖననం..

ఇక్కడ జరిగిన విధ్వంసంపై బుచ్చా మేయర్‌ అనతోలి ఫెడ్‌రక్‌ మాట్లాడుతూ.. బుచ్చా యుద్ధంలో మరణించిన దాదాపు 270 మంది మృతదేహాలను స్థానికులు రెండు చోట్ల సామూహిక ఖననం చేసినట్లు చెప్పారు. వీటిల్లో కొందరి శరీరాలను గుర్తు పట్టలేకపోయినట్లు పేర్కొన్నారు. ఇక ఇక్కడి వీధుల్లో దొరికిన చాలా మృతదేహాలను చూస్తే నేలపై పడుకోబెట్టి వెనక నుంచి కాల్చి చంపినట్లు తెలుస్తోందన్నారు. అదే సమయంలో రష్యా సైనికులు ఆధీనంలోకి తీసుకొన్న ప్రాంతాల్లో మందుపాతరలను అమర్చి వైదొలగినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు.

రష్యా దొంగిలించిన సామగ్రి బెలారస్‌కు తరలింపు..

ఆక్రమణ సమయంలో వివిధ ప్రాంతాల్లో రష్యా సైనికులు దోపిడీలు చేసి పోగుచేసిన సంపదను బెలారస్‌కు తరలిస్తున్నట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ ఆరోపించింది. అక్కడ నగలు, కార్లు, మోటార్‌ సైకిళ్లు, సైకిళ్లు, వాషింగ్‌ మెషిన్లు, డిష్‌ వాషర్లు, కార్పెట్లు, ఆర్ట్‌వర్క్స్‌, పిల్లల బొమ్మలు, కాస్మోటిక్స్‌ను విక్రయిస్తున్నట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌ పౌరుల నుంచి దోచుకొన్న సొమ్ముగా వాటిని అభివర్ణించింది. బెలారస్‌లోని నరోలియాలో ఈ సామగ్రి అమ్మడానికి ఏకంగా ప్రత్యేక బజార్‌నే తెరిచారని పేర్కొంది. ఇక్కడికి ఉక్రెయిన్‌ నుంచి కాన్వాయ్‌ల్లో సామగ్రిని తరలిస్తున్నట్లు వెల్లడించింది.
Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts