Updated : 02 Apr 2022 06:12 IST

Rajya Sabha: రాజ్యసభలో సెంచరీ కొట్టిన భాజపా..!

మూడు దశాబ్దాల రికార్డును అధిగమించిన కాషాయ పార్టీ

దిల్లీ: దేశంలో ఓ వైపు కాంగ్రెస్‌ ప్రాభవం తగ్గిపోతోన్న క్రమంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి భాజపా తన బలాన్ని పుంజుకుంటోంది. పలు రాష్ట్రాల్లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న భారతీయ జనతా పార్టీ.. కేంద్రంలోనూ స్పష్టమైన మెజారిటీతో కొనసాగుతోంది. తాజాగా రాజ్యసభలో 100 సీట్ల మార్కును చేరుకొని అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. భాజపా చరిత్రలోనే ఈ ఘనత సాధించడం తొలిసారి కాగా.. 1990 నుంచి ఏ పార్టీకి రాజ్యసభలో ఇంతటి మెజారిటీ లేకపోవడం గమనార్హం.

రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా ఆరు రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఇందులో పంజాబ్‌లోని ఐదు స్థానాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ కైవసం చేసుకోగా అస్సాం, త్రిపుర, నాగాలాండ్‌ రాష్ట్రాల్లోని ఒక్కో రాజ్యసభ స్థానాల్లో భాజపా మిత్రపక్షాలు విజయం సాధించాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఐదు స్థానాలు మాత్రం విపక్షాల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో రాజ్యసభలో ప్రస్తుతం 97 సభ్యులున్న భాజపా బలం 100కు చేరుకున్నట్లు అయ్యింది (రాజ్యసభ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ కావాల్సి ఉంది).

అప్పట్లో కాంగ్రెస్‌..

మొత్తం 245 సభ్యులు కలిగిన రాజ్యసభలో భాజపా మెజారిటీ తక్కువగానే ఉన్నప్పటికీ.. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2014లో భాజపా బలం 55గా ఉండగా.. ఆయా రాష్ట్రాల్లో వరుస విజయాలతో రాజ్యసభలోనూ తన బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. తాజా ఎన్నికలతో సెంచరీ కొట్టిన భాజపా.. మూడు దశాబ్దాల తర్వాత రాజ్యసభలో 100 సీట్ల మార్కును దాటిన పార్టీగా రికార్డు నెలకొల్పింది. 1990లో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి రాజ్యసభ సభ్యుల బలం 108కి పెరిగింది. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లోనే కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం 99కి తగ్గిపోయింది. అలా అప్పటి నుంచి మొదలైన కాంగ్రెస్‌ పతనం సంకీర్ణ ప్రభుత్వం నాటికి మరింత దిగజారింది.

మైలురాయిని కాపాడుకుంటుందా..?

ప్రస్తుతం రాజ్యసభలో భాజపా 100 స్థానాల్లో కొనసాగుతున్నప్పటికీ ఈ రికార్డును ఎంతకాలం కాపాడుకుంటుందనే విషయం కూడా ప్రధానమైనదే. ఎందుకంటే త్వరలోనే మరో 52 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌తోపాటు ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లో వచ్చే ఫలితాలను బట్టి భాజపా ఈ రికార్డుని నిలబెట్టుకుంటుందా లేదా అనే విషయం తేలుతుంది. అయితే, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 11 స్థానాల్లో కేవలం ఐదుగురు మాత్రమే భాజపా సభ్యులు. ఈసారి మాత్రం ఎనిమిదింటిలో గెలుస్తామనే ధీమాతో భాజపా ఉంది.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని