MLC Kavitha: ఈ నెల 11న ఈడీ విచారణకు హాజరవుతా: ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు సంబంధించి భారాస ఎమ్మెల్సీ కవిత ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ఈనెల 9న విచారణకు హాజరుకాలేనని, 11న హాజరవుతానని చెప్పారు. ఈమేరకు కవిత ట్వీట్‌ చేశారు.   

Updated : 09 Mar 2023 01:36 IST

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam) కేసులో ఈ నెల 9న హాజరుకావాలంటూ భారాస ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆమె విచారణకు హాజరవుతారా? లేదా అనే అంశంపై సందిగ్ధత వీడింది. తాజాగా ఈడీ నోటీసుల అంశంపై  ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) స్పందించారు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున ఈ నెల 9న హాజరు కాలేనని ఈడీకి సమాచారం ఇచ్చారు. అనంతరం 11న ఈడీ విచారణకు హాజరు కానున్నట్లు ఆమె బుధవారం రాత్రి ట్విట్టర్‌లో వెల్లడించారు. అయితే దీనిపై ఈడీ ఇంకా స్పందించలేదు. 

మద్యం కుంభకోణం కేసు విచారణ నేపథ్యంలో ఈడీ(ED) జాయింట్ డైరెక్టర్‌కు కవిత లేఖ రాశారు. ఇంత హడావుడిగా దర్యాప్తు చేయడం ఏంటి? స్వల్పకాలంలో విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని కవిత తన లేఖలో ఈడీని నిలదీసినట్టు సమాచారం. రాజకీయ కక్షలో భాగంగానే నోటీసులు జారీ చేసినట్టు కవిత ఆరోపించారు. దేశ పౌరురాలిగా చట్టపరమైన అన్ని హక్కులూ ఉపయోగించుకుంటానని ఆమె పేర్కొన్నారు. కోర్టు తీర్పు ప్రకారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ, నేరుగా కార్యాలయానికి పిలిచారన్నారు. దర్యాప్తు పేరిట రాజకీయం చేస్తున్నట్లు అనిపిస్తోందని కవిత తెలిపారు.     

శుక్రవారం దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మహిళా బిల్లు ఆమోదం కోసం కవిత దీక్ష చేపట్టనున్నారు. భారత జాగృతి ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల నేతలు, మహిళా సంఘాలను ఆహ్వానించారు. దానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం రెండు రోజులపాటు ముందస్తు షెడ్యూల్‌ కార్యక్రమాలు ఉన్నాయని ఉదయమే కవిత ప్రకటన జారీ చేశారు. అయితే ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో బుధవారం సాయంత్రం కవిత దిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే భారత జాగృతి చేపట్టిన ధర్నా ఏర్పాట్ల కోసమే కవిత దిల్లీ వెళ్లినట్టు పార్టీ నేతలు పేర్కొన్నారు.

దిల్లీ మద్యం కేసులో అరుణ్‌రామచంద్ర పిళ్లై.. భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బినామీ అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపింది. ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్‌గ్రూప్‌ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్‌ సంస్థలో ఎమ్మెల్సీ కవిత తరఫున అరుణ్‌ భాగస్వామిగా ఉన్నారని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంలో నేరపూరిత ఆర్జన రూ.296 కోట్లు ఉండవచ్చని ఆరోపించింది. అయితే కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంతో అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించనున్నట్లు వార్తలు వచ్చాయి.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు