Updated : 11 Mar 2022 04:42 IST

Pujara : కౌంటీ క్రికెట్లోకి పుజారా.. ససెక్స్‌ తరఫున ఆడనున్న టెస్టు స్పెషలిస్ట్‌.!

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్‌ఇండియా టెస్టు జట్టులో చోటు కోల్పోయిన సీనియర్‌ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా త్వరలో ప్రారంభం కానున్న కౌంటీ క్రికెట్లో ఆడనున్నాడు. ‘ససెక్స్’ జట్టు తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్‌ హెడ్.. స్థానంలో పుజారాను జట్టులోకి తీసుకున్నారు.

ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్‌ హెడ్‌ అంతర్జాతీయ క్రికెట్లో బిజీగా ఉండటం, త్వరలో అతడి భార్య తొలి బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో అతడి స్థానంలో పుజారాను జట్టులోకి తీసుకునేందుకు కౌంటీ క్రికెట్ నిర్వాహకులు అంగీకరిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కౌంటీ క్రికెట్‌ సీజన్‌ ఏప్రిల్ 7న ప్రారంభమై సెప్టెంబరు వరకు కొనసాగనుంది. పుజారా ఆడనున్న ససెక్స్ జట్టు ఏప్రిల్ 14న డెర్బిషైర్ జట్టుతో తలపడనుంది. పుజారాకు గతంలో ‘ఇంగ్లిష్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌’లో భాగంగా.. యార్క్‌షైర్‌, నాటింగ్‌హమ్‌ షైర్‌ జట్ల తరఫున ఆడిన అనుభవం ఉంది.

ఫామ్‌లేమితో సతమతమవుతున్న పుజారా శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. దాంతో పాటు రంజీ ట్రోఫీలో అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న సౌరాష్ట్ర జట్టు నాకౌట్ దశకు క్వాలిఫై కాలేదు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలోనూ పుజారాను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పుజారా కౌంటీ క్రికెట్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటి వరకు 95 టెస్టు మ్యాచులు ఆడిన పుజారా 43.88 సగటుతో 6,713 పరుగులు చేశాడు. ఇందులో 18 శతకాలు, 32 అర్ధ శతకాలు ఉన్నాయి. 

‘ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ససెక్స్‌ కౌంటీ క్రికెట్ క్లబ్‌ తరఫున ఆడే అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. గత కొన్నేళ్లుగా కౌంటీ క్రికెట్లో ఆడుతూ.. ఆటను ఆస్వాదిస్తున్నాను. త్వరలోనే ససెక్స్ జట్టులో చేరతాను. జట్టు విజయం కోసం నా వంతు సహకారం అందిస్తాను’ అని పుజారా పేర్కొన్నాడు. ‘అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో అనుభవమున్న పుజారా లాంటి ఆటగాడిని కౌంటీ క్రికెట్లో ఆడటాన్ని స్వాగతిస్తున్నాం. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మా దేశ యువ ఆటగాళ్లకు పుజారా అనుభవం కలిసొస్తుంది’ అని కౌంటీ క్రికెట్ క్లబ్ వెల్లడించింది.

‘ఓ వైపు అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌ను సమన్వయం చేసుకుంటూనే.. తొలి బిడ్డకు జన్మనివ్వనున్న నా భార్యకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఈ కౌంటీ సీజన్‌లో ఆడలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. భవిష్యత్తులో మళ్లీ తప్పకుండా కౌంటీ క్రికెట్ ఆడతాను. ఈ సీజన్‌లో ఆడనున్న ఆటగాళ్లందరికీ ఆల్ ది బెస్ట్’ అని ట్రావిస్‌ హెడ్‌ పేర్కొన్నాడు.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని