Updated : 31 Mar 2022 05:05 IST

Mahesh Bank: బ్యాంక్‌ ఉద్యోగులు ఆ మెయిళ్లను క్లిక్‌ చేశారు: సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌: నగరంలోని మహేశ్‌ బ్యాంక్‌ సర్వర్‌ హ్యాకింగ్‌ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌.. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మీడియాకు వెల్లడించారు. పట్టుదలతో ఈ కేసును ఛేదించినట్లు చెప్పారు. కేసు దర్యాప్తునకు రూ.58 లక్షలు ఖర్చయినట్లు వివరించారు. భవిష్యత్తులోనూ ఈ తరహా కేసులను సులువుగా ఛేదిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

సర్వర్‌లో లోపాలున్నాయి..

‘‘మహేశ్‌ బ్యాంక్‌ను హ్యాకింగ్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. బ్యాంక్‌ ఉద్యోగులకు గతేడాది నవంబర్‌లో 200 ఫిష్షింగ్‌ మెయిల్స్‌ పంపారు. ఆ మెయిళ్లను బ్యాంక్‌ ఉద్యోగుల్లో ఇద్దరు క్లిక్‌ చేయడంతో హ్యాకర్లు బాంక్ సర్వర్‌లోకి చొరబడ్డారు. మహేశ్‌ బ్యాంక్‌ సర్వర్‌లో లోపాలున్నాయి. ఫైర్‌వాల్స్‌ రక్షణాత్మకంగా లేవు. వాటిని ఆసరా చేసుకొని నేరగాళ్లు నగదు బదిలీ చేసుకున్నారు. సర్వర్‌ను పకడ్బందీగా నిర్వహించడానికయ్యే ఖర్చుకు బ్యాంక్ ప్రతినిధులు వెనకడుగు వేశారు. దీని వల్లే సర్వర్ హ్యాక్‌ అయింది. సైబర్‌ నేరగాళ్లు హ్యాకింగ్‌ చేయడానికి రెండు నెలల ముందు బ్యాంక్‌లో ఖాతాలు తెరిపించారు.

23 మందిని అరెస్టు చేశాం..

ఈ ఏడాది జనవరి 23న సర్వర్ హ్యాక్‌ చేసిన తర్వాత.. నిందితులు ముందే సిద్ధం చేసుకున్న నాలుగు ఖాతాల్లో నిల్వలు పెంచేశారు. సదరు ఖాతాల నుంచి దేశంలోని పలు బ్యాంకుల్లో ఉన్న 115 ఖాతాలకు బదిలీ చేశారు. అక్కడి నుంచి మరో 398 ఖాతాలకు నగదు బదిలీ జరిగింది. దీని కోసం నేరగాళ్లు ప్రాక్సీ ఐపీలు ఉపయోగించారు. ఒక ఐపీ స్విట్జర్లాండ్, మరొకటి కెనడాలో చూపిస్తోంది. ఈ హ్యాకింగ్ కేసులో మొత్తం 23 మందిని అరెస్ట్ చేశాం. ఇందులో నలుగురు నైజీరియన్లు ఉన్నారు. ఇవాళ అదుపులోకి తీసుకున్న స్టీఫెన్ ఒర్జి అనే కీలక నిందితుడు ప్రధాన హ్యాకర్‌కు సహకరించాడు. ప్రధాన హ్యాకర్లు నైజీరియాలో ఉన్నారు. వీళ్ల కోసం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే ప్రయత్నం చేస్తాం. మహేశ్‌ బ్యాంక్‌ ప్రతినిధుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమైనందు వల్ల ఈ కేసులో వాళ్లను విచారిస్తాం’’ అని సీవీ ఆనంద్‌ తెలిపారు.  


Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts