Published : 18 Jan 2022 01:54 IST

Safari Browser: యాపిల్ బ్రౌజర్‌లో బగ్‌.. అప్రమత్తంగా ఉండాలన్న నిపుణులు!

ఇంటర్నెట్‌డెస్క్‌: యాపిల్ సఫారీ బ్రౌజర్‌ను ఉపయోగించే యూజర్లకు సైబర్‌ నిపుణులు కీలక సూచనలు చేశారు. సఫారీ బ్రౌజర్‌లోని బగ్‌ కారణంగా యూజర్‌ బ్రౌజింగ్, వ్యక్తిగత డేటాతోపాటు వారి గూగుల్ ఖాతా వివరాలు బహిర్గతం అవుతున్నట్లు గుర్తించామని అమెరికాకు చెందిన ఫింగర్‌ప్రింట్‌జేఎస్‌ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. సఫారీ బ్రౌజర్లలో బ్రౌజింగ్‌ డేటా స్టోర్ చేసేందుకు ఉపయోగించే ఇండెక్సెడ్‌డీబీ అనే అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ (ఏపీఐ)లో బగ్‌ ఉన్నట్లు తెలిపారు. ఇది బ్రౌజర్‌లో యూజర్ ఒక వెబ్‌ పేజ్‌ నుంచి మరో వెబ్‌ పేజ్‌కు మారుతున్నప్పుడు వివరాలను నమోదు చేస్తుంది. ముఖ్యంగా ఒకే రకమైన డొమైన్‌ నేమ్‌లతో యూజర్లను మోసగించే నకిలీ వెబ్‌ పేజీలను ఒరిజినల్ వెబ్‌ పేజీలతో కలవనీయకుండా చేస్తుంది. దీనివల్ల యూజర్లు నకిలీ వెబ్‌సైట్లలో తమ వివరాలు నమోదు చేయకుండా ఉంటారు.

ప్రస్తుతం ఇందులోని బగ్ కారణంగా యూజర్ల సమాచారం బహిర్గతం అవుతున్నట్లు ఫింగర్‌ప్రింట్‌జేఎస్‌ తెలిపింది. ఇప్పటివరకు గూగుల్‌ సర్వీసులతోపాటు, ఇన్‌స్టాగ్రామ్‌, నెట్‌ఫ్లిక్స్, ట్విటర్‌, ఎక్స్‌బాక్స్‌ వంటి 30కిపైగా పాపులర్‌ వెబ్‌సైట్లకు సంబంధించిన యూజర్‌ డేటా బహిర్గతం అయినట్లు పేర్కొంది. సఫారీ 15లో ఈ బగ్‌ను గుర్తించినట్లు వెల్లడించింది. అయితే ఈ బగ్‌ను యూజర్లు ఏమీ చేయలేరని, దీన్ని సరిచేసేందుకు యాపిల్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ బగ్‌కు యాపిల్ అప్‌డేట్ విడుదల చేసేవరకు యూజర్లు ఎదురుచూడక తప్పదంటున్నారు సైబర్‌ నిపుణులు.  అప్పటివరకు సఫారీ బ్రౌజర్‌ను ఉపయోగించకపోవడం మేలని సూచిస్తున్నారు.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts