Updated : 30 Mar 2021 14:34 IST

రాజకీయ హింస ఆమోదయోగ్యం కాదు: మోదీ

కొచ్చి: ప్రజాస్వామ్యంలో రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. కానీ హింస ఆమోదయోగ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేరళలో రాజకీయ హింసకు ఎంతోమంది భాజపా కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ మేరకు ఆయన పాలక్కడ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడారు. పాలక్కడ్‌ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌, వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ల మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కొనసాగుతోందంటూ తీవ్రంగా మండిపడ్డారు.

వారిది మ్యాచ్‌ ఫిక్సింగే!

‘కేరళ రాజకీయాల్లో బయటకు రాని రహస్యం ఒకటుంది. ఎన్నో ఏళ్లుగా ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ కూటములు స్నేహపూర్వకమైన ఒప్పందాన్ని కొనసాగిస్తున్నాయి. ఆ రెండు కూటములే రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశాయి. కానీ భాజపా మాత్రం కేరళను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే రాష్ట్రంలోని యువత, మేధావి వర్గాలు బహిరంగంగానే భాజపాకు మద్దతు పలుకుతున్నాయి. ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్ ప్రభుత్వాల విధానాల కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి వేగం కుంటుపడిపోయింది. కాబట్టి ఈ సారి ప్రజలు వారి ఫిక్సింగ్‌ మ్యాచ్‌ను తిరస్కరిస్తారు’ అంటూ మోదీ విమర్శించారు.

పర్యాటకం అభివృద్ధి కీలకం

‘కేరళకు పర్యాటక రంగంతో మంచి సంబంధం ఉంది. కానీ గత ప్రభుత్వాలు ఆ రంగంలో ఏమాత్రం మౌలిక సదుపాయాల్ని మెరుగు పరచకపోవడం బాధాకరం. గత ఏడు సంవత్సరాల్లో కేంద్రం తీసుకున్న చర్యల కారణంగా పర్యాటక రంగంలో భారత్‌ స్థానం మెరుగు పడింది. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో ఐఐటీలు, ఐటీఐలు నిర్మాణం చేశాం. రైతుల సంక్షేమం కోసం, వ్యవసాయ రంగం అభివృద్ధికోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాలుగా రైతులకు కనీస మద్దతు ధర పెంపుపై హామీలు మాత్రమే ఇచ్చాయి. కానీ మా ప్రభుత్వం రైతులకు మద్దతు ధర పెంపు చేసింది’ అని మోదీ వెల్లడించారు.

రాజకీయ హింసను అంగీకరించబోం

‘ప్రజాస్వామ్యంలో మనకు రాజకీయ విభేదాలు ఉండొచ్చు. కానీ రాజకీయ హింస అనేది ఆమోదయోగ్యం కాదు. రాష్ట్రంలో హింస కారణంగా ఎంతో మంది భాజపా కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. భాజపా అధికారంలోకి వస్తే ఆ విష సంస్కృతికి స్వస్తి పలుకుతుంది. వామపక్షాలు ఎన్నో సార్లు అధికారం చేపట్టాయి. కానీ వారి నాయకులు ఇప్పటికీ కిందిస్థాయి రౌడీల్లానే ప్రవర్తిస్తున్నారు. వారి నేతృత్వంలోనే రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, హత్యలు చేస్తున్నారు. నేను ఆ రెండు కూటములకు ఒక విషయం చెప్పదలచుకున్నా. మీరు కేరళ సంస్కృతిని నాశనం చేయాలని చూస్తే మేం మౌనంగా ప్రేక్షక పాత్ర వహించబోం. కేరళ సంప్రదాయాల గురించి మాట్లాడినందుకు ప్రభుత్వం రాష్ట్ర భాజపా చీఫ్‌ సురేంద్రన్‌ను అరెస్టు చేయడం కరెక్టేనా?’ అంటూ మోదీ తీవ్రంగా మండిపడ్డారు. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్‌ 6వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.


Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని