Updated : 25 Dec 2020 06:56 IST

వధువు వద్దంది.. పెళ్లికొచ్చిన అమ్మాయే పెళ్లికూతురైంది

పోలీసుల ప్రవేశంతో పీటల మీద ఆగిన వివాహానికి నాటకీయ ముగింపు

మరిపెడ, న్యూస్‌టుడే: పెళ్లి మండపం కోలాహలంగా ఉంది. మంగళవాద్యాలు..బంధుమిత్రులతో అంతా సందడి వాతావరణం నెలకొంది. వధూవరులు పెళ్లిపీటలపై కూర్చొని ఉండగా, పురోహితుడు వేదమంత్రాలు చదువుతున్నాడు. మరికొద్ది క్షణాల్లో తాళికట్టే శుభగడియ సమీపిస్తుందనగా, పెళ్లి మండపంలోకి పోలీసులు వచ్చారు. పెళ్లి ఆపాలని సూచించడంతో అందరూ అవాక్కయ్యారు. వధువే పోలీసులను పిలిపించి పెళ్లి ఆపించినట్టు తెలుసుకుని నిశ్చేష్టులయ్యారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ పట్టణంలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మరిపెడ మండలం గుండెపూడికి చెందిన యువకుడికి, కురవి మండలం కాంపెల్లికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టం లేని వధువు ఏకంగా పెళ్లి మండపం నుంచే పోలీసులకు ఫోన్‌ చేసింది. తాను ఓ యువకుడిని ప్రేమించానని, తన ఇష్టంతో ప్రమేయం లేకుండా జరుగుతున్న ఈ పెళ్లిని ఎలాగైనా నిలిపివేయాలని వేడుకుంది. స్పందించిన మరిపెడ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సాగర్‌, ఎస్సై అశోక్‌ పెళ్లి మండపం వద్దకు వచ్చి విచారణ చేపట్టారు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా యువతి ససేమిరా అనడంతో వివాహం నిలిచిపోయింది. అనంతరం యువతిని పోలీసులు కౌన్సెలింగ్‌ నిమిత్తం సఖి కేంద్రానికి తరలించారు. దీన్ని అవమానంగా భావించిన వరుడి తల్లిదండ్రులు వివాహానికి హాజరైన సమీప బంధువుల అమ్మాయితో అదే మండపంలో పెళ్లి చేయడం విశేషం.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని