
విమానం టైర్ల దగ్గర వేలాడుతూ..
లండన్ నుంచి హాలెండ్ చేరుకున్న కెన్యా బాలుడు
లండన్: విమానం ప్రయాణం అనగానే.. సీట్లో కూర్చోవడం.. సీట్‌బెల్ట్ సర్దుకోవడం వంటివన్నీ మనకు తెలిసిన విషయాలే. కెన్యాకు చెందిన 16 ఏళ్లు బాలుడు మాత్రం విమానం చక్రాల దగ్గర ఉండే ల్యాండింగ్ గేర్ పట్టుకుని ఏకంగా గంటసేపు ప్రయాణించాడు. లండన్ నుంచి నెదర్లాండ్స్‌లోని హాలెండ్‌కు వెళ్లాడు. ఈ తరహా చర్యలకు పాల్పడేవారిని స్టోఅవే అని అంటుంటారు. సాధారణంగా వీరంతా మార్గ మధ్యలో జారి పడి మరణిస్తుంటారు. అయితే అదృష్టవశాత్తు కెన్యా బాలుడు సురక్షితంగా దిగడంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతైంది. ఇంగ్లండ్‌లోని స్టాన్స్టెడ్ విమానాశ్రయం నుంచి టర్కీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సరకు రవాణా విమానం దక్షిణ నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిక్ట్ విమానాశ్రయానికి వచ్చింది. అనంతరం విమానం టైర్ల దగ్గర 16 ఏళ్ల బాలుడు ఉండడాన్ని అధికారులు గుర్తించారు. ఉత్తర సముద్రం మీదుగా ఈ విమానం 19,000 అడుగులో ఎత్తులో ప్రయాణించింది. మార్గ మధ్యలో విపరీతమైన అతి శీతల వాతావరణం ఉన్నప్పటికీ బాలుడు జీవించి ఉండడం విశేషం. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో హైపోథెర్మియాకు చికిత్స పొందుతున్నట్లు నెదర్లాండ్స్ పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.