Updated : 27/06/2021 07:46 IST

Sonusood: ఆయన వస్తేనే.. ఓ దారికి తెస్తారేమో! 

 మూడేళ్లుగా పూర్తికాని సిరివర మార్గం  
 గిరిజనులకు ఏళ్లుగా తప్పని డోలీ కష్టాలు 


నిలిచిపోయిన రహదారి నిర్మాణం

సాలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా సిరివర గ్రామ రహదారి పనులు నిలిచిపోవడంతో గిరిజనులంతా అధికారుల వద్దకు పరుగులు పెట్టారు. ఎవరూ స్పందించలేదు. చేసేది లేక  కొదమ పంచాయతీ పరిధిలో కొదమ, చింతామల, సిరవర గ్రామాల ప్రజలు ఏకమయ్యారు. తలోకొంత వేసుకొని యంత్రాలతో ఒడిశా సరిహద్దు గ్రామాలకు మట్టి రహదారులు నిర్మించుకున్నారు. 2020 ఆగస్టులో విషయం తెలియడంతో సినీనటుడు సోనూసూద్‌ ట్విటర్‌లో స్పందించారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్పందించిన ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ అందరితో సమావేశమై పదిరోజుల్లో కొదమతో పాటు చింతామల, సిరివరకు బీటీ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై గిరిజనులు పెదవిరిచారు. ఇప్పటికే చాలామంది వచ్చి ఇవే మాటలు చెప్పారని, సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. అప్పటి పీవో హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.  రెండు నెలల కిందట చేపట్టిన రోడ్డు పనులు కరోనాతో నిలిపేశారు.  


పూర్తి చేస్తాం .. 
ఐటీడీఏ పీవో ఆదేశాలతో సిరివర గ్రామానికి రహదారి నిర్మాణం పునఃప్రారంభించాం. ప్రస్తుతం కరోనాతో ఆగింది. కొదమకు రోడ్డు వేసేందుకు రూ.11 కోట్లు నిధులున్నా అటవీశాఖ అనుమతులు రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రారంభించిన పనులను పూర్తి చేసి గిరిజనుల రోడ్డు సమస్యను పరిష్కరిస్తాం. 
- మణిరాజ్, డీఈఈ, ఐటీడీఏ  

సిరివరకు కాలినడకన వెళ్తూ గిరిజనులతో మాట్లాడుతున్న పీవో లక్ష్మీశ (దాచిన చిత్రం)

సమస్యలు ఇవీ.. 
కొదమ పంచాయతీలోని మోనంగి మినహా అన్ని గ్రామాల వారు రోగులను వైద్యం కోసం డోలీలో తోణాం, సాలూరు తీసుకురావాలి. పాఠశాలలు తెరిచేందుకు ఉపాధ్యాయులు ముందుకు రాక ఒడిశా వైపు విద్యార్థులు వెళ్తున్నారు. ఇంటింటికీ సకాలంలో రేషన్‌ సరకులు అందడం లేదు.  సరకుల కోసం సుమారు పది కిలోమీటర్ల దూరం వరకు కొన్ని గ్రామాల గిరిజనులు రావాలి. నిర్మాణ సామగ్రి తీసుకువెళ్లేందుకు మార్గం లేక సచివాలయ భవన నిర్మాణం పూర్తికాలేదు. 

2018 జులై 30 
సాలూరు మండలం సిరివర గ్రామంలో ఓ గర్భిణి ప్రసవించింది.  ఆ వెంటనే పుట్టిన బిడ్డ చనిపోయింది. ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో డోలీలో 12 కిలోమీటర్లు మోసుకుని మైదాన ప్రాంతానికి, అక్కడి నుంచి వాహనంలో పార్వతీపురం ప్రాంతీయాసుపత్రికి తరలించారు. ఆ విషయం తెలుసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాణాపాయంలో ఉన్న ఆమె మార్గమధ్యలో మరణిస్తే ఎవరిది బాధ్యత అంటూ ఆ సంఘటనను సుమోటోగా స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

2018 ఆగస్టు 2
ఘటనపై స్పందించిన అప్పటి ఐటీడీఏ పీవో లక్ష్మీశ అధికారుల బృందంతో కలిసి 9 కిలోమీటర్లు కొండలు ఎక్కి సిరివర చేరుకొని గ్రామస్థులతో మాట్లాడారు. రహదారి నిర్మించాలని వారు కోరడంతో ఇంజినీరింగ్‌ అధికారులకు హుటాహుటిన ఆదేశాలిచ్చారు. 

2018 ఆగస్టు 3 
పీవో ఆదేశాలతో పరిపాలనా ఆమోదం తీసుకోకుండానే పనులు ప్రారంభించారు. చిలకమెండంగి నుంచి సిరివరకు 9 కిలోమీటర్ల మేర రహదారి వేసేందుకు దశల వారీగా రూ.77 లక్షలు మంజూరు చేశారు. 3.5 కిలోమీటర్ల మేర కొండను తొలచి రహదారి వేశారు. నెలలు గడిచినా బిల్లులు రాకపోవడంతో అక్టోబరులో సదరు గుత్తేదారు మిగిలిన పనులు నిలిపివేశారు. 

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని