
Crime News:నాడు బాగా బతికాడు.. నేడు చోరీలు చేస్తున్నాడు!
రాజేశ్
కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: కరోనా ప్రభావంతో వ్యాపారం దివాలా తీయగా గొలుసు చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. కూకట్పల్లి సీఐ నర్సింగరావు.. డీఐ ఆంజనేయులతో కలిసి సోమవారం వివరాలు వెల్లడించారు. విజయవాడ పరిధి పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన కుర్రా రాజేశ్ (34) ఐడీఏ బొల్లారంలో ఉంటున్నాడు. కరోనా కారణంగా లారీలు నడిపే వ్యాపారం దివాలా తీయడంతో లారీలన్నీ అమ్మేశాడు. ఆ తర్వాత దురలవాట్లకు లోనయ్యాడు. ఆన్లైన్ బెట్టింగ్ చేయసాగాడు. దాంట్లోనూ నష్టం రావడంతో మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య అతనితో ఉండలేక వెళ్లిపోయింది. తర్వాత గొలుసు చోరీలు ఎలా చేయాలో యూట్యూబ్ చూసి నేర్చుకున్నాడు. గతేడాది సెప్టెంబర్ 9న మూసాపేట మెట్రోస్టేషన్ కింద రాత్రి సమయంలో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె మెడలో నుంచి గొలుసు లాక్కొని విజయవాడ పారిపోయాడు. అక్కడ గొలుసును రూ.80 వేలకు విక్రయించి కొన్నిరోజులపాటు జల్సా చేశాడు. ఇదేదో బాగుందనుకున్నాడో.. ఏమో.. రెండో చోరీకి మళ్లీ నగరానికి వచ్చాడు. ఈనెల 11న కేపీహెచ్‌బీ ఠాణాకు సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కొని పారిపోతుండగా ఆమె దొంగదొంగ అని అరిచినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీ పరిశీలించి గతంలో మూసాపేటలో చేసిన చోరీ కూడా ఇతని పనే అని నిర్ధారించారు. సోమవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజేశ్‌ను బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు మొహన్, మురళి పట్టుకున్నారు. రాజేశ్ వద్ద బంగారు ఆభరణాలున్నట్లు గుర్తించి కూకట్పల్లి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రాజేశ్‌ను రిమాండ్‌కు తరలించారు.