
Anand Mahindra: చెన్నై ఆటో డ్రైవర్‌కు ఆనంద్ మహీంద్ర అభినందన
సైదాపేట, న్యూస్‌టుడే: చెన్నై ఆటో డ్రైవర్ అన్నాదురై గురించి మహీంద్ర సంస్థ అధినేత ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చెన్నైలో పలువురికి ఆటో అన్నాగా పరిచమైన అన్నాదురై గురించి తెలిసే ఉంటుంది. కొన్ని టీవీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఆటోలో ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలే ఆనంద్ మహీంద్ర అభినందనకు కారణం. దినపత్రిక నుంచి ఐ-ప్యాడ్ వరకు సకల వసతులు అన్నాదురై ఆటోలో ఉండటం గమనార్హం. ఇది సామాజిక మాధ్యమాల్లో నేడు ట్రెండ్‌గా మారింది. ఆనంద్ మహీంద్ర ఆ ఆటోను చూసి ఆశ్చర్యపోయారంటే వసతులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తంజావూరు సమీపం పేరావూరనిలో పుట్టిన అన్నాదురై కుటుంబం చెన్నైలో స్థిరపడింది. ఆయన తండ్రి, సోదరుడు కూడా ఆటో డ్రైవర్లే. అన్నాదురైకి చిన్నతనం నుంచి వ్యాపారం చేయాలని ఆశ. కుటుంబ పరిస్థితి కారణంగా ఆటో డ్రైవర్‌గా మారారు. ఇక్కడ తన ప్రత్యేక చూపారు. ఐటీ సంస్థలు ఎక్కువగా ఉండే చెన్నై ఓఎమ్మార్ (ఓల్డ్ మహాబలిపురం రోడ్డు)లో అన్నాదురై ఆటో నడుపుతున్నారు. ఆటోలో వార, వార్త పత్రికలు, బిజినెస్ మేగజైన్లు, ఐప్యాడ్, చిన్న టీవీ, అమెజాన్ ఎకో, ల్యాప్‌టాప్, శ్యామ్‌సంగ్ ట్యాబ్, నీళ్ల సీసా తదితర సౌకర్యాలు కల్పించారు. ఉచిత వైఫై వసతి కూడా ఉంది. ఓఎమ్మార్‌లో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఉన్నందున వారి అవసరాల మేరకు వీటిని ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కువ మంది ఆయన ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఈ వ్యాపార నమూనా పలు సంస్థలను ఆకర్షించింది. వాటి ఆహ్వానం మేరకు అన్నాదురై వెళ్లి ప్రసంగాలు కూడా చేస్తున్నారు. ఇలా ఐఐటీ, ఐఐఎంలలో కూడా ప్రగించడం గమనార్హం. ఈ నేపథ్యంలో అన్నాదురై గురించి ఓ ఛానల్ విడుదల చేసిన వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్ర అభినందించారు. అన్నాదురై నుంచి మనం నేర్చుకోవాలని, ఎంబీఏ విద్యార్థులు ఒక్క రోజు ఆయనతో గడిపితే వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఆయన కేవలం ఆటోడ్రైవర్ కాదని, మేనేజ్మెంట్లో ప్రొఫెసరని ట్వీట్ చేశారు. దీంతో అన్నాదురై పేరు మరోమారు సామాజిక మాధ్యమాల్లో మార్మోగుతోంది.