
Plastic Surgery: యువకుడిలా కనిపించాలని ప్లాస్టిక్ సర్జరీ..కళ్లు మూయలేకపోతున్న వృద్ధుడు
యువకుడిలా కనిపించాలన్న ఓ వృద్ధుడి ఆశ.. సమస్యను తెచ్చిపెట్టింది. ఎప్పటికీ కనురెప్పలు మూయలేని విధంగా మార్చింది. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్హమ్కు చెందిన పీట్ బ్రాడ్‌హర్ట్స్(79) కొన్నేళ్ల క్రితం పళ్లకు సంబంధించి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ సర్జరీ వల్ల అతడి బుగ్గల రూపం మారిపోయింది. ‘అందంగా లేవు’ అంటూ భార్య అతణ్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఎలాగైనా అందంగా కనిపించాలని అనుకున్న పీట్.. 2019లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికి బర్మింగ్హమ్లోని బీఎంఐ ఆసుపత్రి వేదికైంది. వైద్యులు 9 గంటల పాటు సర్జరీ చేశారు. పీట్‌కు 11 వేల పౌండ్లు( సుమారు రూ.11 లక్షలు) బిల్ వేశారు. సర్జరీ అయిన వెంటనే పీట్‌కు ముఖంపై ఎవరో కొట్టినట్టు అనిపించింది. కళ్లు మూయలేకపోతున్నానన్న భావన కలిగింది. కుట్లు తీయించుకునేందుకు రెండు వారాల తర్వాత ఆసుపత్రికి వెళ్లాడు. కళ్లలో మంటగా ఉందని, తరచూ నీరు కారుతోందని వైద్యులకు చెప్పాడు. వాళ్లు పట్టించుకోలేదు.
మరో ఆసుపత్రికి వెళ్లగా.. పరిశీలించిన వైద్యులు.. అతడి కనురెప్పలు సరిగా మూసుకోవడం లేదని గుర్తించారు. పీట్ వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేసిన ఆసుపత్రికి వెళ్లాడు. బుగ్గలు, కనురెప్పలు కలిసే చోట చర్మంలో ఇబ్బంది ఉందని చెప్పిన వైద్యులు ఉచితంగా మరో సర్జరీ చేశారు. దీని తర్వాత పీట్ కళ్లు అసలు మూతపడడం లేదు. కళ్ల మంట తగ్గించుకునేందుకు రోజుకు 8సార్లు ఐడ్రాప్స్ వేసుకోవడం తప్పనిసరి. నిద్రపోవాలంటే చిన్నపాటి టవల్‌ను కళ్ల చుట్టుకోవాలి. లేదంటే టేప్ అతికించుకోవాలి. రెండేళ్ల నుంచి ఇలా నరకం అనుభవిస్తున్నాడు. పీట్‌కు మరోమారు సర్జరీ చేసేందుకు యూకేలోని ఏ ఒక్క ఆసుపత్రి ఒప్పుకోలేదు. చివరకు అతను టర్కీ వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు. సమస్య కాస్త తగ్గినా.. ఎడమ కంటిని ఇప్పటికీ మూయలేకపోతున్నాడు.