
Antibodies: ‘బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్’తో బలమైన యాంటీబాడీ స్పందన
అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
వాషింగ్టన్: టీకాలు పొందాక కొవిడ్-19 బారినపడేవారిలో (బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్లు) బలమైన యాంటీబాడీ స్పందన కనిపిస్తున్నట్లు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. మూడుసార్లు టీకా పొందినవారు లేదా ఒకసారి కొవిడ్ బారినపడ్డాక వ్యాక్సిన్ పొందినవారితో సమానంగా ఈ స్పందన ఉన్నట్లు తేలింది. కరోనాలోని డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లకున్న కొన్ని లక్షణాల వల్ల వాటికి ఇన్ఫెక్షన్ను వ్యాప్తి చేసే సామర్థ్యం, రోగనిరోధక శక్తిని ఏమార్చే శక్తి పెరిగింది. వీటికితోడు టీకాల వల్ల లభించిన రోగనిరోధక శక్తి.. కాలక్రమేణా తగ్గిపోవడం వల్ల బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్లు ఉత్పన్నమవుతున్నాయి. అయితే వ్యాక్సిన్ పొందిన ఆరోగ్యవంతులకు వైరస్ సోకితే వారిలో తీవ్రస్థాయి వ్యాధి లక్షణాలు చాలావరకూ కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో టీకా పొందాక కూడా కొవిడ్ బారినపడేవారిలో యాంటీబాడీల తీరుతెన్నులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు.
కొవిడ్ సోకాక టీకా పొందినవారితోను, వ్యాక్సిన్ వేయించుకొన్నవారితోను, మూడు డోసులు పొందినవారితోను వీరిని పోల్చి చూశారు. మూడు టీకాలు వేయించుకున్నవారిలో, కొవిడ్ నుంచి కోలుకున్నాక టీకా వేయించుకున్నవారిలో, బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్ బారినపడ్డవారిలో యాంటీబాడీ స్పందన, తీవ్రత ఒకేలా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీన్నిబట్టి టీకాలు లేదా ఇన్ఫెక్షన్ ద్వారా ఎక్కువసార్లు కరోనా వైరస్‌కు గురయ్యేవారిలో యాంటీబాడీ స్పందన చాలా మెరుగ్గా ఉంటుందని స్పష్టమవుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.