
AP News:‘జగన్ కొంపముంచేది కొడాలి నానే’
వైకాపా ఇసుక దోపిడీ విలువ రూ.5 వేల కోట్లు
మాట్లాడుతున్న తెదేపా నేత మల్లేల లింగారెడ్డి
జమ్మలమడుగు, న్యూస్టుడే: వైకాపా పతనం కావడానికి ప్రజాగ్రహం, ఉద్యోగుల ఉద్యమాలు అవసరం లేదని మంత్రి కొడాలి నాని ఇష్టానుసారంగా మాట్లాడే మాటలే జగన్ కొంప ముంచనున్నాయని కడప పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు మల్లేల లింగారెడ్డి దుయ్యబట్టారు. మంగళవారం తెదేపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. మంత్రి అంటే హుందాతనంగా ఉండాలని, వినకూడని, చదవకూడని భాషను జాతీయస్థాయి నాయకుడైన చంద్రబాబుపై ఆయన ప్రయోగించడం సిగ్గుచేటని విమర్శించారు. కొండాపురం మండలంలోని పొట్టిపాడు, అనంతపురం గ్రామాల్లో చిత్రావతి నదిపై ఉన్న ఇసుక క్వారీల్లో వైకాపా నాయకులు, ఎమ్మెల్యే దోపిడీ ఎక్కువైందని ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, మల్లెల లింగారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీని సీఎం జగన్ రద్దు చేయడంతో భవన నిర్మాణ రంగంలోని కార్మికులతోపాటు 25 రకాల వ్యాపారాలు కుదేలయ్యాయని వాపోయారు. ఇసుక వల్ల ప్రభుత్వానికి రూ.300 కోట్లు ఆదాయం ఉంటే వైకాపా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కలసి రూ.5 వేల కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, పొన్నతోట శ్రీను పాల్గొన్నారు.