Updated : 23 May 2022 09:18 IST

Cheating: ఆమె మామూలు ఆంటీ కాదు.. ఫేస్‌బుక్‌లో ‘ఘాటు ప్రేమ’ కాటు!

మండ్య, న్యూస్‌టుడే: మన్మథుడు సైతం చిన్నబోయేలా ఫేస్‌బుక్‌ ద్వారా చిలిపి సందేశాల్ని పంపుకొన్నారు. ఆమెను తలచుకోనిదే ఒక్క క్షణమైనా గడవని పరిస్థితులకు ఆ యువకుడు చేరుకున్నాడు. ఈ జీవితానికి తన అర్ధాంగి ఆమేనని అందరికీ తేల్చిచెప్పేశాడు. అందుకు ఆమె కూడా అంగీకరించింది. పెళ్లి ఖర్చులకంటూ ఆమె పినతల్లి ద్వారా రూ.3.50 లక్షలను సర్దుబాటు చేశాడు. ఇంతకూ పెళ్లి పీటల మీదకు వచ్చే సరికి కంగుతినడం ఆ యువకుడి వంతైంది. తను ప్రేమించిన అసలైన ఆ కలల రాణికి అక్షరాలా 50 సంవత్సరాలని తెలిసి గుడ్లు తేలేశాడు. పినతల్లిగా నాటకమాడిన మహిళే ఫేస్‌బుక్‌లో పరిచయమైన తన కలలరాణి అని తెలుసుకుని కన్నీరు మున్నీరయ్యాడు. కర్ణాటకలోని మండ్య జిల్లాలోని నాగమంగల తాలూకాలో జరిగిన యథార్థ సంఘటన ఇదీ.

ఆలస్యంగా వెలుగుచూసిన ఆ సంఘటన వివరాల్లోకెళ్తే.. నాగమంగళ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఫేస్‌బుక్‌ ద్వారా ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆమె తన ఫొటోను కూడా పంపింది. ఇద్దరి నడుమ కొనసాగిన చిరు సందేశాలు చివరకు ప్రేమగా మారాయి. తనను చూసేందుకు ఎప్పుడూ రావద్దని ఆమె చెప్పేది. తన తల్లిదండ్రులకు ఇష్టంలేదని వివరణ ఇచ్చేది. పెళ్లికి ఆ యువకుడు ఒత్తిడి చేయడంతో మాట్లాడేందుకు పినతల్లిని పంపుతున్నట్లు చెప్పింది. అనుకున్నట్లుగానే యువకుడి ఇంటికి పినతల్లి వచ్చింది. అందరితో కలుపుగోలుగా మాట్లాడింది. ఇంట్లోవారికి తెలియకుండా ఆ యువకుడు రూ.3.50 లక్షలను ఆమెకు అందించాడు. అనుకున్నట్లుగానే పెళ్లి ఖరారైంది.

ఆదిచుంచనగిరి మఠంలో వివాహాన్ని నిర్ణయించారు. పెళ్లికి వచ్చిన ఆ వయస్సు మళ్లిన మహిళ గత రాత్రే ఆ యువతిని కొందరు అపహరించారని ఓ కథను వినిపించింది. దీన్ని విన్న తరువాత ఆ యువకుడు, అతని తల్లిదండ్రులకు అనుమానమొచ్చింది. వెంటనే ఆమెను పోలీసులకు అప్పగించారు. తమదైన శైలిలో దర్యాప్తును చేపట్టిన పోలీసులకు అసలు యువతి అనేదే ఈ ఘట్టంలో లేదని, ఆమే యువతిగా మరొకరి ఫొటో పంపినట్లు అంగీకరించింది. అంతేకాకుండా.. యువకుడి నుంచి తీసుకున్న రూ.3.50 లక్షలను వెనక్కు ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో కథ సుఖాంతమైంది.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని