Published : 04 Jul 2021 14:42 IST

Phone Battery: చిన్న మార్పు.. పెద్ద లాభం 

ఇంటర్నెట్‌డెస్క్‌: దశాబ్దకాలంగా స్మార్ట్‌ఫోన్‌ టెక్నాలజీలో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ప్రాసెసర్ల నుంచి హై-రిజల్యూషన్ డిస్‌ప్లేల వరకు ఎన్నో రకాల ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే బ్యాటరీ టెక్నాలజీలో మాత్రం పెద్దగా మార్పులు జరగలేదనే చెప్పుకోవాలి. అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలు అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటి పనితీరు ఆశించినంతగా లేకపోవడంతో వినియోగదారులు నిరుత్సాహానికి గురవుతున్నారు. మొబైల్‌ తయారీ కంపెనీలు వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేసినా ఫోన్ వినియోగం గతంలో కంటే పెరిగిపోవడంతో బ్యాటరీ జీవిత కాలం తగ్గిపోతోంది. అయితే, ఫోన్‌లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ లైఫ్ మెరుగుపరచుకునే వీలుంది. మరి ఆ మార్పులేంటో.. వాటిని ఎలా చేయాలో చూద్దాం..!


స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ 

ఫోన్‌ బ్యాటరీ లైఫ్‌ త్వరగా తగ్గిపోవడానికి ముఖ్య కారణం స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌. ఫోన్ కొన్నవెంటనే ఆటో బ్రైట్‌నెస్‌ మోడ్‌ ఆన్‌ చేయడం ఉత్తమం. దానివల్ల లైట్‌ సరిగ్గా లేనప్పుడు లేదా ఇతర సందర్భాల్లో స్క్రీన్ బ్రైట్‌నెస్ దానంతకదే మారిపోవడమే కాకుండా.. బ్యాటరీ పనితీరుపై ప్రభావం చూపించదు. అలానే బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉన్న వాల్‌పేపర్లు వాడకపోవడం మంచిది. వీలైతే ఫోన్‌ని డార్క్‌మోడ్‌లో ఉపయోగించడం అలవాటు చేసుకోండి. నలుపు రంగును చూపించడానికి ఫోన్‌కు ఎక్కువ బ్యాటరీ పవర్‌ అవసరం ఉండదు.


అడాప్టివ్ బ్యాటరీ 

బ్యాటరీపై అధిక భారం పడకుండా ఉండేందుకు గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు పలు చర్యలకు ఉపక్రమించాయి. ఇందులో భాగంగా ఫోన్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్‌లు పనిచేయకుండా ఆండ్రాయిడ్ ఓఎస్‌లో కీలక మార్పులు చేసింది. ఇందుకోసం అడాప్టివ్‌ బ్యాటరీ, బ్యాటరీ ఆప్టిమైజేషన్ వంటి ఫీచర్లను పరిచయం చేసింది. ఒకవేళ మీ ఫోన్లలో ఇవి ఆన్‌ చేయకుంటే సెట్టింగ్స్‌లో డిస్‌ప్లే ఆప్షన్‌లోకి వెళ్లి పైన పేర్కొన్న వాటిపై క్లిక్ చేయండి. 


స్క్రీన్‌ టైం  

చాలామంది ఫోన్ ఉపయోగించిన ఒకటి లేదా రెండు నిమిషాల తర్వాత స్క్రీన్‌ ఆఫ్‌ అయ్యేలా టైమ్‌ లిమిట్ పెడుతుంటారు. దీనివల్ల కూడా బ్యాటరీ పనితీరు నెమ్మదించే అవకాశం ఉంది. ఇక నుంచి మీ స్క్రీన్ టైమ్‌ ఔట్‌ను 20 నుంచి 30 సెకన్లకు తగ్గించి చూడండి. దానివల్ల బ్యాటరీ వినియోగం తగ్గిపోతుంది. అలానే వైఫై, బ్లూటూత్‌, మొబైల్‌ డేటాను అనవసరంగా ఆన్‌ చేయకండి. ఉదాహరణకు వైఫై ఆగిపోయినప్పుడు మొబైల్ డేటా కనెక్ట్ అవుతుంది కదా అని రెండింటినీ ఆన్ చేసి ఉంచితే బ్యాటరీ వినియోగం పెరుగుతుంది. ఫలితంగా బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుంది. 


వాడకుంటే.. డిలీట్‌ 

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఒకటి కన్నా ఎక్కువ ఆండ్రాయిడ్ ఖాతాల్లో లాగిన్‌ అయితే మీ ఫోన్ బ్యాటరీకి ప్రమాదమే. ఎందుకంటే ఇంటర్నెట్‌ నుంచి కాంటాక్ట్స్‌, ఈ-మెయిల్‌, ఫొటోస్‌ వంటి డేటాను ప్రతి ఖాతా నుంచి సింక్‌ చేయాలంటే ఫోన్‌ బ్యాటరీ ఎక్కువగా వినియోగమవుతుంది. అందుకే మీకు అవసరంలేని ఖాతాలను డిలీట్ చేస్తే డేటా వినియోగం తగ్గి, బ్యాటరీపై భారం తగ్గుతుంది. ఒకవేళ ఖాతాలను తొలగించకూడదు అనుకుంటే ఫోన్లో ఆటో-సింక్ ఆప్షన్‌ని డిజేబుల్‌ చేసుకోవడం ఉత్తమం.


బ్యాటరీ సేవింగ్ యాప్‌లు వద్దు 

ఇటీవలి కాలంలో బ్యాటరీ సేవింగ్ కోసమంటూ ఎన్నో రకాల యాప్‌లు ప్లేస్టోర్‌, యాప్‌ స్టోర్లలో ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఫోన్‌లో బ్యాంక్‌గ్రౌండ్ యాప్‌లను పనిచేయకుండా చేయడం లేదా ర్యామ్‌ క్లీన్‌ చేయడం మాత్రమే చేస్తాయి. దానివల్ల బ్యాటరీ పనితీరు ఏ మాత్రం మెరుగుపడదు. అంతేకాక, బ్యాటరీ సేవింగ్ కోసమని వాడుతున్న యాప్‌ బ్యాక్‌గ్రౌండ్‌ యాప్స్‌ అన్నింటినీ క్లోజ్‌ చేయడం వల్ల.. మనం ఫోన్‌ వాడడం ప్రారంభించినప్పుడు ఆ యాప్స్‌ను ఆండ్రాయిడ్‌ మరోసారి రన్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో రెండు సార్లు ప్రాసెస్‌ జరిగి బ్యాటరీపై భారం పడుతుంది. అందుకే బ్యాటరీ సేవింగ్ యాప్‌లను ఉపయోగించకపోవడం మేలంటున్నారు నిపుణులు.


వీటితో పాటు యాప్‌ నోటిఫికేషన్లు, విడ్జెట్లు, ఫోన్ వైబ్రేషన్‌ వంటి వాటి వినియోగంపై కూడా దృష్టి సారించండి. ఎందుకుంటే వరుసగా వచ్చే నోటిఫికేషన్లు, ఉపయోగంలేని విడ్జెట్‌లు, వైబ్రేషన్‌ వంటి వాటి వల్ల బ్యాటరీ పనితీరుపై ప్రభావం పడుతుంది. అందుకే అవసరమైన వాటికే నోటిఫికేషన్లు ఎనేబుల్ చేసుకోవాలి. అలానే విడ్జెట్ తరచుగా వాడకుంటే దానిని కూడా తొలగించడం మేలు. దీర్ఘకాలం ఫోన్ వైబ్రేషన్‌లో ఉపయోగించకపోవడం మంచిది. ఈ చర్యలను పాటించడం వల్ల మీ బ్యాటరీ పనితీరు గతంలో కంటే మెరుగైందో లేదో విశ్లేషించుకోండి.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని