
India Corona: భారీగా మరణాలు.. ఆ ఒక్క రాష్ట్రం నుంచే 300లకు పైగా..!
రోజురోజుకూ తగ్గుతోన్న కొత్త కేసులు
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు మూడు లక్షలకు దిగువనే నమోదవుతున్నాయి. తాజాగా 17 లక్షల మంది వైరస్ నిర్ధరాణ పరీక్షలు చేయించుకోగా.. 2,35,532 మందికి పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 15 శాతం నుంచి 13.39 శాతానికి తగ్గిపోయింది. అయితే పలు రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతిలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. కేరళలో మాత్రం మహమ్మారి విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే అక్కడ 54,537 మందికి కరోనా సోకింది.
800 దాటిన మరణాలు.. కరోనా కేసులు తగ్గుతోన్న సమయంలో.. మరణాల్లో మాత్రం భారీ పెరుగుదల కనిపిస్తోంది. అంతకుముందు రోజు 627 మరణాలు నమోదు కాగా.. నిన్న 871 మరణాలు సంభవించాయి. అందులో 352 కేరళ నుంచి వచ్చినవే. ఈ రాష్ట్రం మునుపటి గణాంకాలను సవరిస్తుండటంతో ఆ తేడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మహారాష్ట్రలో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ సెప్టెంబరు తర్వాత ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. ఈ రెండేళ్ల కాలంలో 4,93,198 మంది మహమ్మారికి బలయ్యారు.
20 లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు..ప్రస్తుతం రికవరీలు పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు తగ్గుతున్నాయి. నిన్న 3,35,939 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 93.89 శాతానికి చేరింది. క్రియాశీల కేసులు 20 లక్షలకు తగ్గగా.. ఆ కేసుల రేటు 5 శాతం దిగువకు పడిపోయింది. ఇప్పటివరకూ 4,08,58,241 మందికి కరోనా సోకగా.. 3,83,60,710 మంది వైరస్‌ను జయించారని కేంద్రం వెల్లడించింది.
ఇక నిన్న 56 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకూ పంపిణీ అయిన డోసుల సంఖ్య 165 కోట్ల మార్కు దాటింది. 15 ఏళ్లు పైబడిన టీనేజర్లకు తొలిడోసు, ముప్పు పొంచి ఉన్న వర్గాలకు ప్రికాషనరీ డోసు ఇస్తుండటం.. మూడో దశలో వైరస్ తీవ్రతను తగ్గించిందని ఇటీవల ప్రభుత్వ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.