Smartphone Virus: స్మార్ట్‌ఫోన్‌లో వైరస్‌.. ఇలా చెక్‌ చేసుకోండి! 

స్మార్ట్‌ఫోన్‌లో వైరస్‌ ఉన్నట్లు ఎలా తెలుసుకోవాలి. అలానే వైరస్‌ బారి నుంచి ఫోన్‌ కాపాడుకునేందుకు ఎలాంట జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. 

Published : 18 Oct 2021 01:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాలం మారింది.. సాంకేతికత సాయంతో కష్టసాధ్యమైన పనులు కూడా సులువుగా జరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ లేనిదే పొద్దుపోని పరిస్థితి. అత్యవసర పనుల నుంచి పిచ్చాపాటీ కబుర్ల కోసం దూరంగా ఉన్న బంధుమిత్రులు, స్నేహితులతో సంభాషించేందుకు మొబైల్‌ఫోన్ ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ క్లాసుల నుంచి ఆఫీస్‌ సమావేశాల వరకూ ఎన్నో విధాలుగా స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించాం. దీంతో ఫోన్‌లోని యూజర్‌ డేటా లక్ష్యంగా జరిగే సైబర్‌ నేరాల సంఖ్య కూడా పెరిగిందని సైబర్ సెక్యూరిటీ సంస్థలు చెబుతున్నాయి. యాప్‌లు, మెసేజ్‌లు, ఈ-మెయిల్‌ వంటి వాటి ద్వారా యూజర్‌ మొబైల్స్‌లోకి వైరస్‌ నుంచి పంపి వారి విలువైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారట. ఈ నేపథ్యంలో మనం ఉపయోగించే మొబైల్‌లో వైరస్‌లో ఉందని ఎలా గుర్తించాలి? వైరస్‌ బారి నుంచి స్మార్ట్‌ఫోన్‌ను ఎలా కాపాడుకోవాలనేది తెలుసుకుందాం. 


వైరస్‌ ఉందని ఎలా తెలుస్తుందంటే!

సెల్‌ఫోన్‌ నుంచి రోజూ మనం ఎన్నో వాయిస్‌, వీడియో మెసేజ్‌లు పంపుతుంటాం. అనుకోకుండా ఫోన్‌ స్లో అవుతుంది. కారణం తెలియక..ఫైల్స్‌, యాప్‌లు డిలీట్‌ చేయడంతోపాటు, ఫోన్ రీస్టార్ట్ చేయడం వంటివి చేస్తుంటాం. కానీ ఫోన్‌ పనితీరులో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. తరచుగా ఈ పరిస్థితి మీకు ఎదురవుతుంటే మాత్రం మీ ఫోన్‌ వైరస్‌ బారిన పడినట్లు అనుమానించాల్సిందేనని అంటున్నారు సైబర్‌ నిపుణులు. అలానే స్మార్ట్‌ఫోన్‌లో వైరస్‌ను గుర్తించేందుకు కొన్ని సూచనలు చేశారు. అవేంటో చూద్దాం.


ఛార్జింగ్ సమస్య

మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ ఉన్నట్లుండి తగ్గిపోతుంటే..అందుకు కారణం వైరస్‌ కావచ్చు. ఎందుకంటే హ్యాకర్స్‌ మన ఫోన్‌లోకి యాప్‌లు, మెసేజ్‌లు, ఈ-మెయిల్‌ ద్వారా వైరస్‌ను పంపుతారు. తర్వాత మన ప్రమేయం లేకుండా ఫోన్‌ నుంచి ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు పంపడమే కాకుండా యాప్‌ల సాయంతో కొనుగోళ్లు చేస్తుంటారు. దీంతో ఫోన్ ఛార్జింగ్ తగ్గిపోతుంది. ఇలాంటి సమస్య మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే మాత్రం వైరస్‌ ఉన్నట్లు అనుమానించాల్సిందే. 


యాప్‌లతో జర భద్రం

మన వ్యక్తిగత అవసరాల కోసం ప్లేస్టోర్ నుంచి ఏవేవో యాప్‌లు డౌన్‌లోడ్ చేస్తాం. వాటిలో కొన్ని నకిలీవి కూడా ఉంటాయి. మనం వాటిని డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే సైబర్ నేరగాళ్లు ఫోన్లలోకి వైరస్‌ను పంపి బ్యాంకింగ్‌ లాగిన్ వివరాలతోపాటు ఇతరత్రా ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. అందుకే ప్లేస్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌ నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేసేప్పుడు అవి వెరిఫైడ్ సోర్స్‌ నుంచి వచ్చినవో కాదో చెక్ చేసుకోవాలి. అలానే రివ్యూలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సదరు యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్న యాప్‌ పేరులో అక్షర దోషాలు, అన్వయ దోషాలు ఉంటే మాత్రం వాటి జోలికెళ్లకపోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు సైబర్‌ నిపుణులు.


రీసెట్ చేయాల్సిందేనా?

స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ యాడ్స్‌ తరచుగా కనిపిస్తుంటే కూడా వైరస్‌ ఉన్నట్లేనంటున్నారు. అలానే మీ అనుమతి లేకుండా కొత్త యాప్‌లు డౌన్‌లోడ్ అవుతున్నా..ఫోన్‌ పనితీరు నెమ్మదించినా ఫోన్ వైరస్‌ బారినపడినట్లే. ఒకవేళ వీటిలో ఏదైనా సమస్య మీ ఫోన్‌లో ఉంటే వెంటనే ఫోన్‌లో అవసరంలేని యాప్స్‌ని తొలగించి..ఫోన్‌ ఫ్యాక్టరీ రీసెట్‌ చేయమని సూచిస్తున్నారు సైబర్‌ నిపుణులు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు