Jignesh Mevani: ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ అరెస్ట్‌.. బెయిల్‌... మళ్లీ అరెస్ట్‌..

గుజరాత్‌ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీకి అనూహ్య అనుభవం ఎదురైంది. బెయిల్‌ వచ్చిన కాసేపటికే ఆయన్ను మళ్లీ పోలీసులు మళ్లీ అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Updated : 26 Apr 2022 04:40 IST

గువాహటి: గుజరాత్‌ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీకి అనూహ్య అనుభవం ఎదురైంది. బెయిల్‌ వచ్చిన కాసేపటికే ఆయన్ను మళ్లీ పోలీసులు మళ్లీ అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ట్వీట్‌ చేసిన వ్యవహారంలో ఈ నెల 19న జిగ్నేశ్‌ను అస్సాంలోని కొక్రాఝర్‌ పోలీసులు అరెస్టు చేయగా.. ఈరోజే కొక్రాఝర్‌ కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, తాజాగా బార్పేట్‌ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. జిగ్నేశ్‌ను ఏ కేసులో అరెస్టు చేస్తున్నది మాత్రం పోలీసులు ఇంకా చెప్పలేదు. 

అసలేం జరిగిందంటే?

ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ జిగ్నేశ్‌ ఈ నెల 18న చేసిన ట్వీట్‌ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీని కాల్చి చంపిన నాథూరాం గాడ్సే పేరును ప్రస్తావిస్తూ మోదీపై ఆయన చేసిన ట్వీట్‌పై  కోక్రాఝర్‌ ప్రాంతంలో భాజపా నేత అరూప్‌ కుమార్‌ డే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో అస్సాం పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈ నెల 19న రాత్రి 11.30గంటల సమయంలో గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో జిగ్నేశ్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను కొక్రాఝర్‌ కోర్టులో ప్రవేశపెట్టగా.. మూడు రోజుల పోలీస్‌ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. బెయిల్‌ పిటిషన్‌పై నిన్న విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం జిగ్నేశ్‌కు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. మరోవైపు, ఈ వ్యవహారం చట్టపరమైన వివాదంగా మారడంతో జిగ్నేశ్‌ పోస్టును ట్విటర్‌ నిలిపివేసింది. జిగ్నేశ్‌ ట్వీట్‌ విషయంలో అస్సాం పోలీసుల చర్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. జిగ్నేశ్‌ గుజరాత్‌లోని వడగాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

నా అరెస్టు వారి కుట్రే..
తన అరెస్టుపై జిగ్నేశ్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రధాని కార్యాలయం ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే తన అరెస్టు జరిగిందన్నారు. తన అరెస్టు భాజపా, ఆరెస్సెస్‌ కుట్రగా పేర్కొన్నారు. తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఇలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదంతా వ్యవస్థీకృతంగా చేస్తున్నారనీ.. గతంలో రోహిత్‌ వేముల.. ఇటీవల చంద్రశేఖర్‌ ఆజాద్‌పైనా ఇలాగే చేశారనీ.. ఇప్పుడు తనను టార్గెట్‌ చేస్తున్నారని ఆరోపించారు.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts