
Air strikes: యెమన్లోజైలుపై వైమానిక దాడి.. 100కిపైగా మృతి!
సనా: యెమన్, సౌదీ అరేబియా దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. రెండు దేశాలు ఒకదానిపై మరొకటి వైమానిక దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. సౌదీ తాజాగా యెమన్లోని సాదా జైలుపై వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 100మందికి పైగా మృతి చెందినట్లు యెమన్లోని రెడ్‌క్రాస్ అంతర్జాతీయ కమిటీ అధికార ప్రతినిధి బషీర్ ఒమర్ వెల్లడించారు. మరో 100 మంది గాయపడినట్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. పలువురు క్షతగాత్రులను చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు తరలించినట్టు పేర్కొన్నారు. మృతుల్లో పలువురు చిన్నారులు, ఆఫ్రికా వలసదారులు కూడా ఉన్నట్లు సమాచారం. తీరప్రాంత నగరం హొడేయిదాలో మరో వైమానిక దాడి జరిగి.. యెమన్‌లో మొత్తం అంతర్జాల సేవలకు అంతరాయం ఏర్పడిందని, ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం జైలుపై దాడి జరిగినట్లు బషీర్ ఒమర్ వెల్లడించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుధాబిలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై యెమన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ నెల 17న జరిపిన దాడుల్లో ఇద్దరు భారతీయులతో సహా ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా కొద్ది గంటల్లోనే సౌదీ అరేబియా సంకీర్ణ దళాలు.. హౌతీ తిరుబాటుదారుల ఆధీనంలోని యెమన్ రాజధాని సనాపై 18న వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో దాదాపు 11 మంది మృతి చెందారు. దీంతోపాటు సౌదీ అరేబియా వైపు ప్రయోగించిన ఎనిమిది డ్రోన్లను అడ్డుకున్నట్లు ఈ దళాలు వెల్లడించాయి.