Updated : 31 Dec 2020 19:18 IST

వైరల్‌ వీడియోస్‌ 2020: మిస్‌ కాకండేం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వల్ల మిగిలిన రోజుల్లో మాదిరిగా స్వేచ్ఛగా బయటకు రాలేని స్థితి.. అలాగని ఇంటిలోనూ ఉండలేని పరిస్థితి. మరి ఇలాంటప్పుడు మనని ఆదుకునేవి సామాజిక మాధ్యమాలేగా. కారణమేదైనా ఈ సంవత్సరం ఇంటర్‌నెట్‌ వాడకం అధికం కావడం గమనార్హం. కొవిడ్‌ ఆంక్షలు, భయం వంటి వాటి కారణంగా  గడప దాటలేక సతమతమౌతున్న ప్రజలను వైరల్‌ వీడియోలే కాలక్షేపం అందించి కాపాడాయి. మరి 2020లో సామాజిక మాధ్యమాలను ఒక ఊపు ఊపిన పది వీడియోలు, వాటి వివరాలు ఇవిగో..

1. రసోడే మే కౌన్‌ థా..

సాథ్‌ నిభానా సాథియా అనే సీరియల్‌ పాత్రల మధ్య జరిగిన సంభాషణలో వచ్చే ‘రసోడే మే కౌన్‌ థా.. ’ అనే  డైలాగ్‌ విపరీతంగా పాపులర్‌ అయింది. దీనిలో కోకిలా బెన్‌ అనే పెద్దావిడ చెప్పే ఈ డైలాగ్‌ని యక్ష్‌రాజ్‌ ముఖాంతే అనే యువకుడు పాప్‌ సాంగ్‌గా మార్చి నెట్టింట్లో షేర్‌ చేశాడు.  గిలిగింతలు పెట్టే ఈ వీడియో నెటిజన్లలో చర్చనీయాంశమైంది.. 23 లక్షలకు పైగా లైక్‌లను లెక్కలేనన్ని వ్యూస్‌ను సంపాదించుకుంది.


2. ముంబయి వైద్యుల కరోనా నృత్యం

కరోనా కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో.. వైద్యారోగ్య సిబ్బందికి ఊపిరి సలపని బాధ్యతలు. వీటి మధ్య ఆటవిడుపు అన్నట్టుగా డాక్టర్‌ రిచా నేగి..  స్టీట్‌ డాన్సర్‌ 3డీ హిందీ చిత్రంలోని ‘గర్మీ’ పాటకు కాలు కదిపారు. పీపీఈ సూట్‌లోనే ఉన్నప్పటికీ ఆమె వేసిన స్టెప్స్‌ సూపర్‌గా ఉన్నాయని సోషల్‌ మీడియా పక్షులు అంటున్నాయి. జులైలో విడుదలైన ఈ వీడియోకు అద్భుత స్పందన లభించింది.


3. లక్కీ అలీ ‘ఓ సనమ్‌’ గీతం..

భారత్‌కు చెందిన తొలితరం పాప్‌ గాయకుడు లక్కీ ఆలీ. 90లలో ఈయన గీతాలు, ఆల్బమ్స్‌ నాటి యువతరాన్ని ఉర్రూతలూగించాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం 62 ఏళ్లున్న అలీ  1996 నాటి హిట్‌ పాంగ్‌ ‘ఓ సనమ్‌’ను తన అభిమానుల కోసం నవంబర్‌లో మరోసారి ఫేస్‌బుక్‌లో పాడి వినిపించారు. అన్‌ప్లగ్‌డ్‌ వెర్షన్‌లో సాగిన ఈయన గానానికి సంగీత ప్రేమికులు పరవశించారు.


4. ‘ప్రభుత్వం నా చెప్పులు లాగేసుకుంది..’

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతన్నలు భారీ సంఖ్యలో దిల్లీ సరిహద్దుల్లో బైఠాయించారు.  వీరికి మద్దతుగా కిసాన్‌ ఏక్తా సంఘ్‌ మహిళా మోర్చా అధ్యక్షురాలు  ఠాకూర్‌ గీతా భారతి ఆందోళనలో పాల్గొన్నారు. ఐతే.. తమ నిరసనలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం, పోలీసులు కలసి తన చెప్పులను కాజేసాయని వాటిని తిరిగివ్వాలని ఆమె ‘గట్టిగా’ చేసిన డిమాండ్‌ సామాజిక మాధ్యమాల్లో ప్రతిధ్వనించింది.


5. కాల గమనంలో పొదరిల్లు

ఓ బల్లపై క్రమ పద్ధతిలో అమర్చిన పలురకాల పచ్చని  క్రోటన్‌ మొక్కలు.. మధ్యన ఎర్రరంగులో ఉన్న ఓ గడియారం... ఈ ఏర్పాటుకు సామాజిక మాధ్యమాల్లో తొమ్మిది మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి.   ఇందుకు సంబంధించిన ఓ  ‘టైమ్‌లాప్స్‌’ వీడియోను @Melora_1 అనే నెటిజన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. కాలగమనానికి అనుగుణంగా మొక్కల హావభావాలను ప్రతిబింబిస్తోందా అన్నట్టున్న దీనిని.. సాంకేతిక దిగ్గజం ఎలాన్‌ మస్క్‌, ట్రంప్‌ కుమార్తె ఇవాంకాతో సహా పలువురు శభాష్‌ అన్నారు.


6. యువతి చేసిన సూపర్‌ నూడుల్స్‌

ఒకప్పుడు ప్రపంచ యువతను ఉర్రూతలూపింది గంగ్నమ్‌ స్టైల్‌ డాన్స్‌. దక్షిణ కొరియా గాయకుడు సై  2012లో పాడిన ఈ పాప్‌ గీతంలోని బీట్‌, యువత హార్ట్‌బీట్‌ను క్యాచ్‌ చేసింది. కాగా, అదే బీట్‌కు డ్యాన్స్‌ చేస్తూ.. ఓ యువతి నూడిల్స్‌ తయారు చేసింది.  ఉడుకుతున్న వేడి నూడుల్స్‌ పాత్రను తల చుట్టూ తిప్పుతూ ఆమె చేసిన విన్యాసాలను నెటిజన్లు రెప్ప ఆర్పకుండా చూశారు.. 10 మిలియన్‌ వ్యూస్‌ ఇచ్చారు!


7. భాంగ్రా చేద్దాం.. రా!

ఓ పంజాబీ బుడతడు చేసిన భాంగ్రా డ్యాన్స్‌కు గేటు లోపల ఉన్న రెండు కుక్కలు ఫిదా అయ్యామన్నట్టు.. అవి కూడా ఎగిరాయి. మరి ఈ మూవ్‌మెంట్స్‌ ఇరవై మిలియన్ల వ్యూస్‌ స్వంతం చేసుకున్నాయి మరి.  ఈ వీడియోను తొలుత వినీత్‌ కటారియా అనే వ్యక్తి ట్విటర్‌ ఖాతాలో అక్టోబర్‌లో పోస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఎంతో మంది రీట్వీట్‌ చేసిన ఇది.. అందరికో ఫేవరిట్‌ అయింది.


8. ఇది ‘నిజమైన’ స్నేక్‌ డ్యాన్స్‌!

రెండు పాములు పచ్చని ప్రకృతి ఒడిలో రెండు పాములు మెలికలు తిరుగుతూ ఆడిన సయ్యాట సామాజిక మాధ్యమాల్లో మార్చిలో తెగ చక్కర్లు కొట్టింది. అవి నిజంగా నృత్యం చేస్తున్నాయా అనే అంశం చర్చనీయాంశమైంది. సమాగమం సమయంలో చేసే విన్యాసం అని కొందరు అంటే.. కాదు అవి ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటున్నాయని కొందరు వాదించారు. ఏదేమైనా ఈ చర్చ సదరు వీడియోను తెగ వైరల్‌ చేసింది.


9. క్వారంటైన్‌ కేంద్రంలో ‘చతురమైన’ నృతం..

1967లో విడుదలైన సూపర్‌ హిట్‌ హిందీ చిత్రం ‘పడోసన్‌’లో అత్యంత ఆదరణ పొందిన గీతం.. ‘ఏక్‌ చతుర నార్‌..’  కరోనా కలిగించే నెగిటివ్‌ భావనలను అంతం చేయడానికా అన్నట్టు.. బిహార్‌లోని క్వారంటైన్‌ కేంద్రంలో ఓ వ్యక్తి జూన్‌లో ఆ పాటకు అనుగుణంగా చక్కగా పంచె కట్టుకుని మరీ వయ్యారంగా చేసిన నృత్యం నెటిజన్లతో శభాష్‌ అనిపించుకుంది.


10. నా జుట్టు మీద చెయ్యేశావో...

పసివాళ్లకు కటింగ్‌ చేయించటం తల్లిదండ్రులకు  ఎప్పుడూ కత్తిమీద సామే. భయంతోనే లేదా చిరాకు వల్లనో వారు ఓ పట్టాన ఇందుకు ఒప్పుకోరు. జుట్టు కత్తిరించేప్పుడు కుదురుగా కూర్చోరు. మరి ఇలాంటి గడుగ్గాయిలకు ప్రతినిధి అనదగ్గ  చిన్నారి అనుశ్రుత్‌.  నాగ్‌పూర్‌లో తీసిన ఈ వీడియోలో ఈ బుడతడు బార్బర్‌ను ఎలా దెబ్బలాడుతున్నాడో.. పది లక్షల మందికి పైగా చూసిన ఈ వీడియోలో మీరూ చూసేయండి!


11. #బాబా కా దాబా

కరోనా సంక్షోభంతో దిల్లీలోని మాలవియా నగర్‌లో ఓ వృద్ధదంపతులు నిర్వహిస్తున్న చిన్న దాబా హోటల్‌ కొన్నాళ్లు మూతపడింది. ఆ తర్వాత తెరిచినా కస్టమర్లు రాకపోవడంతో వృద్ధులకు ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్టోబర్‌ నెలలో ఓ వ్యక్తి వారి పరిస్థితిని వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయగా ‘బాబా కా దాబా’ హాష్‌ ట్యాగ్‌తో తెగ వైరల్‌ అయింది. ఆ పోస్టును సినీతారలు సహా ఎందరో ప్రముఖులు షేర్‌ చేశారు. దీంతో ‘బాబా కా దాబా’ హోటల్‌లో తినడం కోసం దిల్లీవాసులు క్యూ కట్టారు. పలువురు ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడు ఆ వృద్ధదంపతులు ఏకంగా ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించి కొత్త జీవితం మొదలుపెట్టారు. 
 

ఇవీ చూడండి..

2020 మీమ్స్‌..

2020: జంతు ప్రపంచపు సిత్రాలు!

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని