
Covid 19: దిల్లీ జైళ్లలో కొవిడ్ విజృంభణ.. 180కిపైగా కేసులు నమోదు!
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ జైళ్లలో కొవిడ్ 19 వ్యాప్తి తీవ్రమవుతోంది. నగరంలోని వివిధ జైళ్లలో ఇప్పటివరకు 90 మందికిపైగా ఖైదీలు, 80 మందికిపైగా అధికారులకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో దిల్లీలోని జైళ్లలోనే 50-100 పడకల మెడికల్ సెంటర్లను జైళ్ల శాఖ ఏర్పాటు చేస్తోంది. కొవిడ్ సోకిన ఖైదీలకు అక్కడే చికిత్స అందిస్తున్నారు. తాజాగా వైరస్ సోకిన వారిలో చాలా మంది ఖైదీలకు జైలు డాక్టర్లే చికిత్స అందిస్తున్నారు.
డిసెంబర్ నుంచి జనవరి 15 మధ్యలో తిహాడ్, రోహిణి, మండోలి జైళ్లలో 99 మంది ఖైదీలకు, 88 మంది అధికారులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. దీనిపై జైళ్ల శాఖ డీజీ సందీప్ గోయల్ మాట్లాడుతూ ‘‘కరోనా కేసులను జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఇప్పటివరకు తీవ్రమైన లక్షణాలతో ఎటువంటి కేసులు రాలేదు. వ్యాధి సోకిన వారికి జైలు డాక్టర్లు చికిత్స అందజేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. జైలు డిస్పెన్సరీలను ఇప్పటికే కొవిడ్ కేర్ సెంటర్లుగా మారుస్తున్నారు. తిహాడ్ జైల్లోని 120 పడకల ఆసుపత్రిలో కేవలం కొవిడ్ రోగులకు మాత్రమే చికిత్స చేస్తున్నారు.
ఇవీ చదవండి
Advertisement