Published : 28 May 2022 02:46 IST

flight: విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడికి గుండెపోటు.. ఎలా కాపాడారంటే?

దిల్లీ: ఓ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దీంతో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన క్యాబిన్‌ సిబ్బంది అతడి ప్రాణాలను కాపాడటంలో కీలకంగా వ్యవహరించారు. కన్నూరు నుంచి దుబాయి వెళ్తున్న గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్‌ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యూనస్‌ రేయాన్‌రోత్‌ అనే వ్యక్తికి గుండెపోటు రాగా.. తమ సిబ్బంది సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవడంతో అతడికి ప్రాణాపాయం తప్పినట్టు విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇలాంటి ఆపద సమయంలో చురుగ్గా స్పందించిన క్యాబిన్‌ సిబ్బందికి నగదు రివార్డు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

‘‘యూనస్‌ రేయాన్‌రోత్‌ అనే ప్రయాణికుడు.. గో ఫస్ట్‌ విమానంలో కన్నూరు నుంచి దుబాయి వెళ్తున్నాడు. అతడికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. తోటి ప్రయాణికులంతా హెల్ప్‌.. హెల్ప్‌ అని కేకలు వేశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి అపస్మారక స్థితిలో పడి ఉన్న ప్రయాణికుడిని గుర్తించారు. అతడిలో నాడీ స్పందన లేదు. శ్వాస తీసుకోవడం లేదు. ఇక ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా ఇతర ప్రయాణికుల సహాయంతో విమానంలో వేరే చోటకు మార్చి కార్డియో పల్మనరీ రీసఫిటేషన్‌  (సీపీఆర్‌) ప్రక్రియను అనుసరించారు. అదృష్టవశాత్తూ డాక్టర్‌ షబర్‌ అహ్మద్‌ అనే వైద్యుడు కూడా అదే విమానంలో ఉండటంతో అతడి సహాయం తీసుకున్నారు. గుండెపోటుకు గురైన వ్యక్తికి ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్స్‌ (ఏఈడీ) యంత్రంతో షాక్‌ ఇవ్వడంతో పాటు సీపీఆర్‌ ప్రక్రియ చేపట్టి అతడిని బతికించారు. ఆ తర్వాత ప్రయాణికుడిని ఆక్సిజన్‌పై ఉంచి కోలుకొనే స్థితికి తీసుకొచ్చారు. చివరకు అతడు స్పృహలోకి వచ్చాడు’’ అని ఎయిర్‌లైన్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

అత్యంత ఆపద సమయంలో తమ సిబ్బంది ఎంతో సమర్థంగా పనిచేశారంటూ ఎయిర్‌లైన్స్‌ ప్రశంసించింది. వైద్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాక్‌పిట్‌ సిబ్బందికి కూడా అప్‌డేట్స్‌ చేరవేశారని తెలిపింది. దుబాయిలో విమానం ల్యాండ్‌ కాగానే యూనస్‌ చివరకు వీల్‌చైర్‌పై దిగారని ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది. తమ విమానంలో ఎదురైన అత్యవసర పరిస్థితుల్లో వైద్యసాయం అందించిన వైద్యుడికి, ఆ ప్రయాణికుడికి కాంప్లిమెంటరీగా ఉచిత టిక్కెట్లు ఇచ్చింది. తమ విమాన నెట్‌వర్క్‌లో ఏదైనా దేశీయ లేదా అంతర్జాతీయ ప్రయాణం ఉచితంగా చేసేందుకు అవకాశం కల్పించింది.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని