
Rajamouli: క్యాన్సర్‌తో పోరాడుతోన్న దేవిక.. సాయం చేయండంటూ రాజమౌళి ట్వీట్
హైదరాబాద్: ‘బాహుబలి’ సినిమా కోసం పనిచేసిన దేవిక అనే మహిళ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. దయచేసి సాయం చేయండంటూ ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు. దేవిక స్టోరీని షేర్ చేసిన ఆయన.. ‘‘బాహుబలి సమయంలో దేవికతో కలిసి పనిచేశాను. ఎన్నో పోస్ట్ ప్రొడెక్షన్స్ పనులకు ఆమె కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. పని పట్ల ఆమెకున్న అంకితభావం ఎనలేనిది. దురదృష్టవశాత్తు ఆమె ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. దయచేసి ఆమెకు ఆర్థికసాయం చేయడానికి మీరూ ముందుకు రండి’’ అని పేర్కొన్నారు.
మధ్య తరగతి కుటుంబానికి చెందిన దేవిక గతంలో ఓసారి క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. దేవిక పెద్ద కుమారుడు అరుదైన వ్యాధితో ఇబ్బందిపడుతున్నాడు. కుటుంబపోషణ, కుమారుడి వైద్య ఖర్చుల కోసం ఆమె కూడా భర్తతోపాటు ఉద్యోగం చేసేందుకు ముందుకు వచ్చింది. కుమారుడి ఆరోగ్యం చక్కబరుచుకోవచ్చు అనుకునే సమయంలో ఆమె భర్త కిడ్నీ సమస్యతో కన్నుమూశారు. కుటుంబపోషణ మొత్తం మీద వేసుకున్న ఆమెపై మరోసారి క్యాన్సర్ మహమ్మారి దాడి చేసింది. ప్రస్తుతం ఆమె బ్లడ్ క్యాన్సర్‌తో ఇబ్బందిపడుతోంది. చికిత్సకు సుమారు రూ.3 కోట్లు అవసరమవుతోంది. దేవిక కథ తెలుసుకున్న ఓ ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ సైట్.. విరాళాల సేకరణకు ముందుకు వచ్చింది. ఆమె కథను అందరికీ తెలియజేసేలా ఓ ఆర్టికల్‌ను ప్రచురించింది. రాజమౌళి ట్విటర్ వేదికగా ఆమె దీనగాథను షేర్ చేసి.. ఫండ్రైజ్కు ముందుకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు.