JioPhone Next: జియోఫోన్‌ నెక్ట్స్‌లో కొత్త ఓఎస్‌.. ఫీచర్లివే! 

జియోనెక్ట్స్‌ ఫోన్‌కి సంబంధించిన కీలకమైన ఫీచర్లను రిలయన్స్ జియో వీడియో ద్వారా విడుదల చేసింది. ఈ ఫోన్ భారతీయుల డిజిటల్ అవసరాలను తప్పక తీరుస్తుందని వీడియోలో వెల్లడించింది. 

Updated : 26 Oct 2021 00:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతీయ మొబైల్‌ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జియో ఫోన్‌ నెక్ట్స్‌ని రూపొందిస్తున్నట్లు రిలయన్స్‌ జియో సంస్థ తెలిపింది. తమ సంస్థ నుంచి కొత్తగా తీసుకొస్తున్న ఈ ఫోన్ భారతీయుల డిజిటల్‌ అవసరాలను తప్పక తీర్చగలదనే ధీమా వ్యక్తం చేసింది. తాజాగా ఈ ఫోన్ తయారీ, ఫోన్‌లో రాబోతున్న ఫీచర్ల గురించిన వీడియోను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఫోన్‌ను దీపావళి పండుగకు విడుదల చేస్తున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో జియో విడుదల చేసిన వీడియోలో ప్రస్తావించిన ఫీచర్లేంటో ఒక్కసారి చూద్దాం.


జియో కోసం ఆండ్రాయిడ్‌ ‘ప్రగతి’

గూగుల్‌తో కలిసి జియో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ లైట్‌ వెర్షన్‌ ఓఎస్‌ ఆండ్రాయిడ్‌ గో ఎడిషన్‌తో పనిచేస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, గూగుల్‌ దీని కోసం ప్రగతి అనే ఓఎస్‌ను అభివృద్ధి చేసినట్లు ఆండ్రాయిడ్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ రామ్‌ పాపట్ల తెలిపారు. భారత్‌లో కొత్త తరం మొబైల్ ఇంటర్నెట్‌ యూజర్స్‌కి కొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ప్రగతి ఓఎస్‌ను రూపొందిచినట్లు వెల్లడించారు. ప్రగతి ఓఎస్‌ బ్యాటరీని తక్కువగా ఉపయోగించుకుంటుందట. దానివల్ల బ్యాటరీపై ఒత్తిడి తగ్గి ఛార్జింగ్ ఎక్కువసేపు ఉంటుందని జియో తెలిపింది.


క్వాల్‌కోమ్ ప్రాసెసర్‌

క్వాల్‌కోమ్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇందులో ఏ మోడల్‌ ప్రాసెసర్ ఉపయోగించారనేది వీడియోలో వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 215 క్యూఎమ్‌215 ప్రాసెసర్‌ను ఉపయోగించారనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. జియోనెక్ట్స్‌ ఫోన్‌ని యూజర్‌ ఫ్రెండ్లీ డివైజ్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రాసెసర్‌ను రూపొందించినట్లు క్వాల్‌కోమ్ ఇండియా ఇంజనీరింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శశి రెడ్డి తెలిపారు. 


12 భాషల్లోకి తర్జుమా..

జియోనెక్ట్స్‌ ఫోన్‌లో ఆకర్షణీయమైన ఫీచర్స్‌ ఉన్నట్లు జియోఫోన్ నెక్ట్స్‌ ప్రొడక్ట్ మేనేజర్‌ బినిష్‌ పరంగోదత్‌ తెలిపారు. ఇందులోని ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ యూజర్‌ ఒక భాషలో మాట్లాడితే 12 భాషల్లోకి తర్జుమా చేస్తుందని వెల్లడించారు. అలానే ఇందులో వాయిస్‌ అసిస్టెంట్ ఫీచర్‌ కూడా ఇస్తున్నారు. దీని సాయంతో యూజర్స్‌ ఫోన్‌లో తమకు అవసరమైన సేవలను సులభంగా పొందొచ్చు. యాప్‌ ఓపెన్‌ చేసి తమకు అనుకూలమైన భాషను ఎంచుకొని సెట్టింగ్స్‌లో మార్పులు చేస్తే వాయిస్‌ అసిస్టెంట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. 


యాప్‌ ఏదైనా.. బిగ్గరగా చదివేస్తుంది

ఈ ఫోన్‌లో మరో అద్భుతమైన ఫీచర్‌ రీడ్‌ అలౌడ్‌. ఈ ఫీచర్‌ ఏ యాప్‌లోని టెక్ట్స్‌ లేదా కంటెట్‌నైనా బిగ్గరగా చదివి వినిపిస్తుందని జియోఫోన్ నెక్ట్స్‌ తయారీ విభాగం హెడ్‌ అశోక్ అగర్వాల్ తెలిపారు. దానివల్ల యూజర్స్‌ ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోగలరని చెప్పారు. 


కెమెరా

ఈ ఫోన్‌లో రెండు కెమెరాలున్నాయి. వెనుక, ముందు రెండు వైపులా 13 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఇందులో పొట్రెయిట్ మోడ్‌ సాయంతో చక్కటి ఫొటోలను తీయొచ్చు. ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌ బ్లర్‌, నైట్‌ మోడ్‌, ఆగ్యుమెంటెడ్‌ రియాల్టీ ఫిల్టర్స్‌ వంటి పీచర్లున్నాయి. 


ఈ ఫోన్‌లో గూగుల్, జియో యాప్‌లు ప్రీలోడెడ్‌గా ఇస్తున్నారు. ప్లేస్టోర్‌లోని అన్ని రకాల యాప్‌లను ఈ ఓఎస్‌ సపోర్ట్ చేస్తుందని సమాచారం. అలానే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లు కూడా ఆటోమేటిగ్గా అవుతాయని తెలుస్తోంది. 2 జీబీ ర్యామ్‌ ఉంటుందని సమాచారం. 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారట. ఈ ఫోన్‌ ధర సుమారు రూ. 3,500 నుంచి రూ. 5,000 ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మేకిన్‌ ఇండియా, మేక్ ఫర్‌ ఇండియా స్ఫూర్తితో జియోనెక్ట్స్‌ ఫోన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, తమిళనాడులోని శ్రీపెరంబదూరు ప్లాంట్లలో తయారు చేస్తున్నారు. 


Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని