
Telangana news : తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థల పునఃప్రారంభం: సబిత
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలన్నింటినీ పునఃప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 8 నుంచి విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. కానీ, రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరగడంతో వైద్యశాఖ సిఫారసు మేరకు ఈ నెల 31 వరకు సెలవులను పొడిగించింది. తాజాగా రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గడంతోపాటు, పొరుగు రాష్ట్రాల్లోనూ పాఠశాలలు తెరుచుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలోనూ విద్యాసంస్థలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు విద్యా సంస్థల్లో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని వైద్యాధికారులను ఆదేశించింది.