
వాహనం జప్తు చేయొద్దు.. ఆ అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదు: హైకోర్టు
రోడ్డుపై ఆగిపోయిన మయాంక్ కుటుంబం
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: పెండింగ్ చలానాలున్న వాహనదారులు రోడ్డెక్కాలంటే భయపడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని జప్తు చేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఒక్క పెండింగ్ చలానా ఉన్నా వాహనం జప్తు చేయొచ్చని ఓ ట్రాఫిక్ అధికారి పేరొన్నట్లుగా వార్తలు వెలువడటంతో భయం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు మార్గదర్శకాలు వాహనదారులకు ఊరటనిచ్చాయి.
* కూకట్పల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న నిఖిలేష్ తొగరి ఆగస్టు 1న బైకుపై వెళ్తుండగా పర్వత్‌నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఆ బైక్‌పై రూ.1635 చలానా పెండింగ్ ఉందని, చెల్లించాలని ఎస్సై మహేంద్రనాథ్ కోరారు. నిరాకరించిన యజమాని వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఒక్క చలానాకే సీజ్ చేస్తారా అంటూ న్యాయవాది నిలదీశారు. నిబంధనల ప్రకారమే చేశామని పోలీసులు స్పష్టం చేశారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. చలానా ఎక్కడ వేశారు..? ఎందుకు వేశారు? తదితర వివరాలను అడగ్గా ప్రవేశం లేని పైవంతెనపై ప్రయాణించారని, ప్రమాదకర డ్రైవింగ్, ఆదేశాల ఉల్లంఘన పేరిట మొత్తంగా రూ.1635 జరిమానా చెల్లించాలనడంతో లాయర్ అవాక్కయ్యారు. నో ఎంట్రీకి కేవలం రూ.135 జరిమానా వేయాల్సింది ఇంత ఎలా రాశారు? ఒక్క ఉల్లంఘనకు మూడు శిక్షలా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చిర్రెత్తుకొచ్చిన ఆ న్యాయవాది హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. విచారించిన హైకోర్టు పోలీసుల తీరుపై ఆగస్టు 11న ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం వాహనం సీజ్ చేయకూడదని పేర్కొంది. వాహనం తిరిగివ్వాలని ఆదేశించడంతో ఆ వాహనాన్ని తిరిగిచ్చేశారు.
వాహనదారుల బాధలు వర్ణనాతీతం
* మయాంక్ జోషి భార్యా పిల్లలతో కలిసి అద్దె కారులో శామీర్‌పేట్ నుంచి మణికొండ వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డగించారు. కారుపై రూ.19,695 పెండింగ్ చలానాలున్నాయని నిలిపేశారు. 45 నిమిషాలైనా వదల్లేదని, స్పందించాలంటూ విషయాన్ని జూమ్‌కార్, ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్ ద్వారా తెలిపగా, ఆ తర్వాత వారిని వదిలిపెట్టారు.