ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గిందా.. అయితే...

వైఫై ఇంటర్నెట్‌ స్లోగా ఉంది అనిపిస్తోందా.. అయితే ఈ పని చేయండి

Updated : 24 May 2021 14:37 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోం, ఆన్‌లైన్‌ క్లాస్‌ల కాలం కావడంతో... ప్రస్తుతం చాలా ఇళ్లల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్లు, వైఫై రూటర్‌లు కనిపిస్తున్నాయి. అయితే వాటితోపాటే ‘మా ఇంటర్నెట్‌ స్పీడ్‌గా లేదు!’ అనే కంప్లైంట్‌ ఎక్కువగా వినిపిస్తోంది.  మీకూ ఇలాంటి ఇబ్బందే ఉందా... అయితే ఈ స్టోరీ మీ కోసమే! 

ఇంటర్నెట్‌ స్పీడ్‌ అనేది ప్రదేశం, వాడే వస్తువుల సంఖ్య, వాడే వస్తువుల స్థాయిని బట్టి మారిపోతుంది. అందుకే ఒకే స్పీడ్‌ ఉన్న ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసుకున్నప్పటికీ... అందరికీ ఒకే స్పీడ్‌ కనిపించదు. అయితే స్పీడ్‌ తగ్గినప్పుడు ఈ దిగువ పాయింట్లు చెక్‌ చేసుకుంటే వేగం పెరిగే అవకాశాలున్నాయి. 


వైర్‌కి మారిపోండి

వైఫై రూటర్‌ ఉంది కదా... మళ్లీ కేబుల్‌ ఎందుకులే అని చాలామంది డెస్క్‌టాప్‌లకు వైఫై డాంగిల్‌ వాడుతుంటారు. దీని వల్ల నెట్‌ స్పీడ్‌ తగ్గే అవకాశం ఉందట. అందుకే వీలైనంత వరకూ రూటర్‌ నుంచి వైర్డ్‌ కనెక్షన్‌ వాడితే మంచిదని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. వైర్‌లెస్‌ వాడేటప్పుడు గోడలు, దూరం అనేవి కీలకంగా మారి ఇంటర్నెట్‌ వేగం తగ్గుతుందట.


పాస్‌వర్డ్‌ పెట్టాల్సిందే

నాకు వైఫై ఉందని ఎవరికీ తెలియదులే, తెలిసినా ఎవరూ వాడరులే అని చాలామంది వైఫైకి పాస్‌వర్డ్‌ పెట్టుకోరు. దీని వల్ల ఇతరులు మీ వైఫైని యాక్సెస్‌ చేసి వాడేస్తుంటారు. దీని వల్ల కూడా ఇంటర్నెట్‌ వేగం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వైఫై రూటర్‌కు పాస్‌వర్డ్‌ పెట్టుకోవడం అత్యవసరం. అలాగే ఎవరికైనా అవసరం పడి వైఫై యాక్సెస్‌ ఇస్తే.. పని పూర్తయ్యాక వాళ్లను బ్లాక్‌ చేయాలి. రూటర్‌ లాగిన్‌లో ఈ పని చేయొచ్చు. 


హార్డ్‌వేర్‌ సంగతి చూడండి

మొబైల్స్‌, కంప్యూటర్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ఉంటాయి. అలాగే రూటర్లు కూడా. ఎప్పటిదో పాత రూటర్‌ బాగానే ఉంది కదా... ఇంకా వాడదాం అంటూ కొనసాగించడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. పాత రూటర్‌తో ఇంటర్నెట్‌ వేగం తక్కువగానే ఉంటుంది. అందుకే ఈ విషయంలో  ఎప్పుడూ వెనకడుగు వేయొద్దు. మీ నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌తో మాట్లాడి బ్రాడ్‌బ్యాండ్‌ వివరాలు తెలుసుకొని దానికి తగ్గ రూటర్‌ను తీసుకోవడం ఉత్తమం. 


అటక మీద పెట్టొద్దు

వైర్లు అడ్డుగా ఉన్నాయనో, పిల్లలకు దూరంగా పెట్టాలనో రూటర్‌ను చాలామంది కప్‌బోర్డుల పైన, గదిలో ఓ మూలకో పెట్టేస్తుంటారు. దీని వల్ల ఇంటర్నెట్‌ వేగంలో మార్పు ఉంటుందట. అందరికీ అందుబాటులో ఉండేలా వైఫై రూటర్‌ను పెట్టడం మంచిది అంటున్నారు టెక్‌ నిపుణులు. మొత్తం ఇంటికి మధ్యలో ఉండేలా రూటర్‌ను పెట్టుకోవడం ఉత్తమమట. బాగా పెద్ద ఇల్లు అయితే... వైఫై ఎక్స్‌టెండర్లు కొనుక్కోవచ్చు. 


పవర్‌ లైన్‌ అడాప్టర్లు

ఇల్లు చాలా పెద్దది, ఎక్స్‌టెండర్లు వాడొద్దు అనుకుంటే వైఫై వేగం పెంచడానికి  మరో ఆప్షన్‌ ఉంది. అదే పవర్‌ లైన్‌ అడాప్టర్స్‌. చూడటానికి సాధారణ అడాప్టర్‌లా కనిపించే వీటిని చెరో గదిలో పవర్‌ ప్లగ్‌కు పెట్టాలి. అప్పుడు వైఫై రూటర్‌ ఉన్న గదిలోంచి వైఫై సిగ్నల్స్‌ వేరే గదిలో ఉన్న రూమ్‌లోకి వెళ్తాయి. దీంతోపాటు ఇలాంటి సర్వీసు ఇవ్వడానికి బ్రాడ్‌బ్యాండ్‌  యాక్సిలరేటర్స్‌ ఉన్నాయి. వీటితో వైఫై వేగాన్ని బూస్ట్‌ చేయొచ్చట. అయితే ఈ సర్వీసులు అన్ని బ్రాడ్‌ బ్యాండ్‌ సర్వీసులు ఇవ్వడం లేదు. 


- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు