Updated : 27 Jan 2022 17:03 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

1.చర్చలు మినహా ఉద్యోగ సంఘాలకు ప్రత్యామ్నాయం ఏముంది?: సజ్జల

పీఆర్సీపై ఉద్యోగుల్లో అపోహలు తొలగించేందుకు ఓ మెట్టు దిగేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చర్చలకు ఏర్పాటైన మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల కోసం సచివాలయంలోనే అందుబాటులో ఉందని చెప్పారు. అమరావతిలో మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి మీడియాతో సజ్జల మాట్లాడారు.

2.‘ఏపీ సేవ 2.0’ ప్రారంభించిన సీఎం జగన్‌

పాలనలో మరింత వేగం, పారదర్శకత, జవాబుదారీతనం కోసం సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ను ప్రారంభించినట్లు ఏపీ సీఎం జగన్‌ చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘ఏపీ సేవ 2.0’ పోర్టల్‌ను జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పలకడానికి అనువుగా ఉండేందుకు పోర్టల్‌కు ‘ఏపీ సేవ’ అని పేరు పెట్టినట్లు తెలిపారు.
3.టాటాల చేతికి ఎయిరిండియా.. అధికారికంగా అప్పగించిన ప్రభుత్వం

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా టాటాల వశమైంది. అధికారికంగా టాటా సన్స్‌కు కేంద్రం గురువారం అప్పగించింది. దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌కాంత్‌ పాండే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఎయిరిండియా అప్పగింత ప్రక్రియ పూర్తయినందుకు సంతోషంగా ఉందని టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా చంద్రశేఖరన్‌ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.

Video: కొలంబియాలో ఆకట్టుకుంటున్న తలకిందుల ఇల్లు!

4.మార్కెట్లకు ఫెడ్‌ ఎఫెక్ట్‌.. తీవ్ర ఊగిసలాటలో మార్కెట్లకు భారీ నష్టాలు

‘ఫెడ్‌’ నిర్ణయం దలాల్‌ స్ట్రీట్‌ను కుదిపేసింది. మదుపర్లను బెంబేలెత్తించింది. సూచీలను తీవ్ర ఊగిసలాటలోకి నెట్టేసింది. వడ్డీ రేట్లను పెంచనున్నట్లు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతాలివ్వడం దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావమే చూపించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో గురువారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు భారీ నష్టాలతో ప్రారంభించాయి. ఒక దశలో సెన్సెక్స్‌ ఏకంగా 1400 పాయింట్లకు పైగా పతనమైంది.

5.కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ మార్కెట్‌ విక్రయానికి గ్రీన్‌సిగ్నల్‌

కొవిడ్‌ నివారణకు మన దేశంలో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌లను బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు అవసరమైన సాధారణ అనుమతులను భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) మంజూరు చేసింది. కొన్ని షరతులకు లోబడి ఈ రెండు టీకాల విక్రయానికి అనుమతి ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. న్యూడ్రగ్స్‌ అండ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ రూల్స్‌-2019 కింద రెగ్యులర్‌ మార్కెట్లో అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు.

6.దిల్లీలో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేత.. రెస్టారంట్లు, థియేటర్లకు 50%వెసులుబాటు

కరోనా ఉద్ధృతి నుంచి దేశ రాజధాని దిల్లీ కాస్త కోలుకుంటోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే వైరస్‌ కట్టడి కోసం విధించిన ఆంక్షలను ఆప్‌ సర్కారు సడలించింది. వారాంతపు కర్ఫ్యూతో పాటు, దుకాణాలపై సరి-బేసి విధానాన్ని ఎత్తివేసింది. అంతేగాక, సినిమా హాళ్లు, రెస్టారంట్లు సగం సామర్థ్యంతో నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది.

7.కెప్టెన్సీపై ఆలోచించడం లేదు.. కానీ!

ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్‌ఇండియా టెస్టు సారథ్య బాధ్యతల గురించి ఆలోచించడం లేదని.. అయితే, తనకు ఏ అవకాశం ఇచ్చినా దాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమి పేర్కొన్నాడు. ఇటీవల భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్‌ కోల్పోయిన అనంతరం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. దీంతో నాటి నుంచి టెస్టు కెప్టెన్సీపై సందిగ్ధత నెలకొంది.

Mahabubabad: వీధి కుక్కలు.. ఆ కుటుంబానికి నేస్తాలు!

8.వింటర్‌ ఒలింపిక్స్‌లో జోక్యం కాదు.. ముందు ఆ వివాదాన్ని తీవ్రంగా పరిగణించండి

బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్ సమీపిస్తున్న క్రమంలో చైనా తాజాగా మరోసారి అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విశ్వక్రీడల విషయంలో జోక్యం చేసుకోవడాన్ని మానుకోవాలని హెచ్చరించింది. బదులుగా.. యూరప్‌లో రష్యాతో నెలకొన్న భద్రతా ఆందోళనలను తీవ్రంగా పరిగణించాలని సూచించింది. చైనా, అమెరికా విదేశాంగ మంత్రులు వాంగ్‌ యీ, ఆంటోని బ్లింకెన్‌ల తాజా టెలిఫోన్‌ సంభాషణపై.. డ్రాగన్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. బీజింగ్‌లో ఫిబ్రవరి 4 నుంచి వింటర్‌ ఒలింపిక్స్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

9.యూపీ పరిస్థితి ‘సగం ఆదాయం.. రెట్టింపు ద్రవ్యోల్బణం’గా ఉంది: అఖిలేశ్‌ యాదవ్‌

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి ‘సగం ఆదాయం.. రెట్టింపు ద్రవ్యోల్బణం’గా ఉందని సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ప్రజలు కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బుధవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

10.అరుణాచల్‌ యువకుడిని అప్పగించిన చైనా.. కేంద్ర మంత్రి ట్వీట్‌

ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల మిరామ్‌ తరోన్‌ను చైనా సైన్యం అపహరించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పెద్దఎత్తున దుమారం రేగడంతో.. చైనా బలగాలతో హాట్‌లైన్‌ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఆ యువకుడి ఆచూకీ కనుగొన్నట్లు పీఎల్‌ఏ గత ఆదివారం తెలిపింది. తాజాగా గురువారం అతన్ని భారత సైన్యానికి అప్పగించింది.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని