
Taliban: ఆగని తాలిబన్ల దుశ్చర్యలు.. సంగీతకారుడిపై కన్నెర్ర!
కాబుల్: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, ఆహార కొరత తదితర సమస్యలు వేధిస్తోన్నా, స్థానికంగా హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పలు అంతర్జాతీయ సంస్థలు నివేదికలు వెల్లడిస్తోన్నా.. మరోవైపు తమదైన ఆంక్షల పాలన సాగిస్తున్నారు. తాజాగా స్థానికంగా ఓ సంగీతకారుడికి సంబంధించిన వాయిద్యాన్ని వారు అతని ముందే తగులబెట్టడం చర్చనీయాంశమైంది. ఇక్కడి పక్తియా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సంగీతకారుడు ఏడుస్తూ ఉండగా.. తాలిబన్లు అక్కడే తుపాకులతో నవ్వుతూ నిలబడ్డట్లు కనిపిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గతేడాది ఆగస్టులో తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించింది మొదలు.. కఠిన నియమాలతో పాలన సాగిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల వాహనాల్లో సంగీతం ప్లే చేయడాన్ని కూడా నిషేధించారు. ఇదే కాకుండా వివాహాది వేడుకల్లోనూ లైవ్ మ్యూజిక్‌ను బ్యాన్ చేశారు. ఈ మేరకు ప్రమోషన్ ఆఫ్ వర్చ్యూ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్ మినిస్ట్రీ మార్గదర్శకాలు జారీ చేస్తోంది.