Published : 10/02/2021 12:52 IST

చెమట ఇంధనం.. చరిత వందనం

ఎన్నెన్నో రికార్డులను సొంతం చేసుకున్న విశాఖ స్టీల్‌ప్లాంటు

ప్రైవేటీకరిస్తున్న నేపథ్యంలో  కార్మికలోకం అయోమయం

విశాఖపట్నం: పోరాడి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ కోసం కార్మిక లోకం అహోరాత్రులు శ్రమించింది. కండలు కరిగించి ఇనుప కడ్డీలుగా మార్చింది. నిప్పురవ్వలను కాచుకొని నిఖార్సయిన ఉక్కు ఉత్పత్తులను శ్రామిక లోకం రూపొందించింది. విశాఖ ఉక్కుకే అంతర్జాతీయ ఖ్యాతిని సాధించిపెట్టింది. కాలానుగుణ మార్పులకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను కూడా ఒడిసిపట్టుకుంది. ఎన్నెన్నో ప్రత్యేకతలు, రికార్డులను పరిశ్రమ తన ఖాతాలో జమ చేసుకుంది. ప్రైవేటీకరిస్తున్న సమయంలో ఈ ఘనతర కీర్తి చరిత్ర పుటల్లో కలిసిపోతుందేమోనన్న ఆందోళన తెలుగువారిని వెన్నాడుతోంది. పరిశ్రమ అందించిన, అందిస్తున్న అనిర్వచనీయమైన సేవలను కార్మికలోకం ప్రస్తుతం గుర్తు చేసుకుంటోంది. 

అన్ని యంత్రాలు ఇక్కడే ప్రథమం

పరిశ్రమ ఏర్పాటుకు మన దేశానికి రష్యా సహకరించింది. కర్మాగారం ఆవిర్భావ సమయంతోపాటు కాలక్రమంలో ఏర్పాటుచేసిన 3 బ్లాస్ట్‌ఫర్నేస్‌లు ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నాయి. ఉత్పత్తి సమయంలోనే ద్రవ ఉక్కు ‘కంటిన్యుయస్‌ కాస్టింగ్‌’ విధానంలో బ్లూమ్స్‌గా మారుతాయి. ఈ విధానాన్ని దేశంలో విశాఖ ఉక్కు కర్మాగారమే మొదలుపెట్టింది. బొగ్గును కోక్‌గా మార్చే భారీ ‘కోక్‌ ఒమెన్‌’ బ్యాటరీలు విశాఖ ఉక్కు కర్మాగారంలో ఐదు ఉన్నాయి. ఒక్కో బ్యాటరీలో 67 ఓవెన్లు ఉంటాయి. ఒక్కో ఓవెన్‌ పొడవు 7మీటర్లుంటుంది. ఇంతటి పొడవైన ఓవెన్లను కూడా ఇక్కడే మొదటిసారిగా నెలకొల్పారు.  

ఆకృతులకు ఇక్కడే రూపు

ద్రవ ఇనుముకు ఆక్సిజన్, ఫెర్రోమాంగనీస్‌ జోడించి స్టీల్‌మెల్ట్‌ షాపు (ఎస్‌ఎంఎస్‌)లో ద్రవ ఉక్కుగా మారుస్తారు. ఒక్కో ఎస్‌ఎంఎస్‌లో 3 కన్వర్టర్లున్నాయి. ఇలాంటి ఎస్‌ఎంఎస్‌లు కర్మాగారంలో రెండున్నాయి. కర్మాగారంలో ఎల్‌ఎంఎంఎం (లైట్‌ మీడియం మర్చంట్‌ మిల్‌), వైర్‌రాడ్‌ మిల్, ఎంఎంఎస్‌ఎం (మీడియం మర్చంట్‌ స్ట్రక్చరల్‌ మిల్‌), ఎస్‌బీఎం (స్పెషల్‌ బార్‌ మిల్‌), డబ్ల్యూఆర్‌ఎం2 (వైర్‌రాడ్‌ మిల్‌ 2), ఎస్‌టీఎం (స్పెషల్‌ స్టీల్‌ మిల్‌) తదితర రకాల రోలింగ్‌మిల్స్‌ ఉన్నాయి. సంస్థ ఉత్పత్తి చేసిన ఉక్కుబ్లూమ్స్‌ను వివిధ ఆకృతుల్లో ఈ మిల్స్‌లోనే మారుస్తారు. 

తీరప్రాంతంలో మొదటిది

నీటి వనరుల కోసం సంస్థ ప్రాంగణంలోనే 2 రిజర్వాయర్లున్నాయి. 152 కి.మీ. దూరం ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఏలేరు రిజర్వాయర్‌నుంచి నేరుగా ఈ కర్మాగారానికి నీరందించేలా కాలువలున్నాయి. దేశంలో మొదటిసారి తీర ప్రాంతంలో నెలకొల్పిన ఉక్కు కర్మాగారం ఇదే. ముడిసరకు, ఉత్పత్తుల దిగుమతి, ఎగుమతులకు అవకాశాలున్నందునే కర్మాగారం ఏర్పాటుకు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అత్యున్నత ప్రమాణాలతో కర్మాగారాన్ని నిర్వహిస్తూ ఐ.ఎస్‌.ఒ.9001:2008 (ప్రస్తుతం 2015), ఐ.ఎస్‌.ఒ.14001:2004 (ప్రస్తుతం 2015), ఓహెచ్‌ఎస్‌ఏఎస్‌ 18001: 2007 తదితర ధ్రువీకరణలు పొందిన మొదటి ఉక్కు కర్మాగారంగా గుర్తింపు పొందింది.  

నాణ్యతకు పెద్దపీట

అందమైన ఉద్యానవనాలు, చిట్టడవుల పచ్చదనంతో పరిశ్రమ అలరారుతుంది. దశలవారీగా మొక్కలను పెంచుతుండటంతో ఇప్పుడు ప్రాంగణంలో 50 లక్షలకుపైగా చెట్లున్నాయి. విద్యుత్‌ అవసరాల కోసం థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ను సంస్థలోనే నిర్మించారు. అవసరాలకు మించి ఉత్పత్తయ్యే అదనపు విద్యుత్తును గ్రిడ్‌కు ఇస్తారు. సంస్థ ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే వ్యర్థ వాయువులను (కోక్‌ ఓవెన్‌ గ్యాస్‌)ను ఇంధనంగా మార్చి వివిధ విభాగాల్లో వాడుతున్నారు. ఉక్కు ఉత్పత్తి ప్రక్రియలో స్క్రాప్‌ను ఏమాత్రం కలపకుండా వంద శాతం నాణ్యమైన ‘వర్జిన్‌ స్టీల్‌’ ఉత్పత్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి..

రాజకీయాలకతీతంగా ఉద్యమిద్దాం: విజయసాయి

ప్రైవేటీకరణ.. కాదంటే మూత

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని