Published : 22 Jan 2022 01:43 IST

UP Polls: భాజపా ఎన్నికల సాంగ్స్‌ విడుదల‌‌.. బులంద్‌షహర్‌లో కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌!

లఖ్‌నవూ: మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేతల రాజకీయ వలసలు ఊపందుకోవడంతో పాటు అభ్యర్థుల ఎంపిక, అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలతో యూపీలో రాజకీయం హీటెక్కింది. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న అధికార భాజపా.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు ప్రజల్లోకి మరింతగా దూసుకెళ్లేందుకు శుక్రవారం ఎన్నికల పాటలను విడుదల చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఉప ముఖ్యమంత్రులు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, దినేశ్ శర్మలతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ కమలదళం ఎన్నికల పాటలను లఖ్‌నవూలో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్‌ విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో రాష్ట్ర శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించి గత ప్రభుత్వాల అండతో రెచ్చిపోయిన అల్లరిమూకలు ఇప్పుడు బహిరంగంగా రహదారులపై తమ పోస్టర్లను అతికిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తాము అందరి అభివృద్ధి కోసం పనిచేశాం తప్ప ఏ ఒక్కరికోసమో కాదన్నారు. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ ప్రభుత్వాల హయాంలో చక్కెరమిల్లులు మూతపడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తమ ప్రభుత్వమే చెరకు రైతులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను ఇచ్చిందన్నారు. 2017 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని ఈ సందర్భంగా యోగి స్పష్టంచేశారు.


అమిత్ షా ఇంటింటి ప్రచారం రేపు!

మరోవైపు, దేశ రాజకీయాలను శాసించే యూపీలో అధికార పీఠాన్ని కాపాడుకొనేందుకు భాజపా తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం యూపీ పర్యటనకు రానున్నారు. కైరానా నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించడంతో పాటు స్థానిక నేతలతో సమావేశమవుతారు. అలాగే, షామిలి, బాఘ్‌పట్‌లలో కూడా భాజపా కార్యకర్తలతో సమావేశం కానున్నట్టు సమాచారం. ఆ తర్వాత మేరఠ్‌లో ప్రముఖ వ్యక్తులతోనూ అమిత్ షా సమావేశం కానున్నారు.


బులంద్‌ షహర్‌లో కాంగ్రెస్‌కు షాక్‌!

అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాక్‌ తగిలింది. బులంద్‌షహర్‌లో ఆ పార్టీకి ఇద్దరు కీలక నేతలు రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ రాజీనామా చేసినట్టు సమాచారం. బులంద్‌షహర్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు షియోపాల్‌ సింగ్‌, జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ వాల్మికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అనూప్‌షహర్‌ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తానని షియోపాల్ సింగ్‌ కోరగా.. అందుకు కాంగ్రెస్‌ నిరాకరించింది. ఆ స్థానంలో బీఎస్పీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఇటీవల తమ పార్టీలో చేరిన చౌదురి గజేంద్రసింగ్‌ను బరిలో దించింది. గజేంద్రసింగ్‌ గత నెలలోనే ఆర్‌ఎల్డీలో చేరగా.. అక్కడ టికెట్‌ నిరాకరించడంతో కాంగ్రెస్‌ చేరడం గమనార్హం.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని