Published : 15 Jan 2021 17:14 IST

మీరు నడిస్తే... వీళ్లు డబ్బులిస్తారు

రోజూ నడిస్తే ఆరోగ్యం... ఈ మాట చాలా రోజుల నుంచి వింటున్నాం. అయితే ఆరోగ్యంతోపాటు డబ్బులు కూడా వస్తాయంటే.. ‘అరె భలే ఉందే ఈ ఆప్షన్‌’ అనుకుంటున్నారా. అయితే ఈ కథనం మీ కోసమే..  ఇంకెందుకాలస్యం నడిచి డబ్బులు సంపాదించేయండి!

మామూలు స్టెప్స్‌ ట్రాకింగ్‌ యాప్స్‌ అయితే మీరెన్ని అడుగులు వేశారో చెబుతాయి. ఈ యాప్స్‌ అయితే వాటితోపాటు, నడక వల్ల మీరెంత డబ్బు సంపాదించారో కూడా చెబుతాయి. అవేంటి.. ఎలా వాడాలో చూద్దాం.


నడకతో విరాళం...

నడిచి డబ్బులు సంపాదించి.. ఆ డబ్బును స్వచ్ఛంధ సేవా సంస్థలకు ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే మీకు శ్రమ తగ్గించేలా ఛారిటీ మైల్స్‌ యాప్‌ను రూపొందించారు. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి, ఓపెన్‌ చేయగానే... ‘మీరు ఏ ఛారిటీకి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు?’ అని అడుగుతుంది. మీకు నచ్చిన సంస్థ పేరు ఎంచుకున్నాక యాప్‌ పని చేయడం మొదలుపెడుతుంది. మీరు వేసిన అడుగులు, దూరం లెక్కించి మీ నడకకు ఎంత డబ్బులు వచ్చాయో చెబుతుంది. ఇందులో బృందంగానూ డబ్బులు సంపాదించి, దానం చేసే ఆప్షన్‌ ఉంది. • యాప్‌ డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి


పందెం కాసి నడవండి

బెట్‌ కాసి... అనుకున్నది సాధించేవాళ్లను చాలామందిని చూసే ఉంటారు. మీరు కూడా అలాంటి పని ఎప్పుడో ఒకప్పుడు చేసే ఉంటారు. అలా అయితే ‘స్టెప్‌ బెట్‌’ యాప్‌ మీకు ఉపయోగపడుతుంది. ఇందులో రోజకు ఇన్ని అడుగులు వేయాలి అంటూ కొన్ని టాస్క్‌లు ఉంటాయి. వాటిని అధిగమిస్తే మీరు కాసిన బెట్‌కు మించి డబ్బులు వస్తాయి. అయితే బెట్‌లో ఉన్న టాస్క్‌లు చేయకపోతే మీరు ఓడిపోతారు. స్టెప్‌ బెట్‌లో నేరుగా స్టెప్‌ కౌంటింగ్‌ ఉండదు. ఫిట్‌బిట్‌, గూగుల్‌ ఫిట్‌, శాంసంగ్‌ హెల్త్‌ లాంటి ప్రముఖ యాప్స్‌ ఇంటిగ్రేట్‌ అయి ఉంటాయి. వాటి ఆధారంగానే యాప్‌ పని చేస్తుంది. • యాప్‌ డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి


నడవండి.. కూపన్లు సంపాదించండి

మనకు వచ్చే సొమ్ము డబ్బులే అవ్వక్కర్లేదు.. కూపన్లు వచ్చినా చాలు అనుకుంటే ‘లింపో’ యాప్‌ను వాడి చూడొచ్చు. ఇందులో యాక్టివిటీలు పూర్తి చేస్తే లిమ్‌ కాయిన్స్‌ వస్తాయి. వాటిని రెడీమ్‌ చేసుకొని యాప్‌లోనే అవసరమైన వస్తువులు కొనుగోలు చేయొచ్చు. మీరు చేసిన టాస్క్‌లు, ఘనతలను స్నేహితులతో పంచుకుని, వారికి స్ఫూర్తిగా నిలవొచ్చు. లిమ్‌ టోకెన్స్‌తో గిఫ్ట్‌ వోచర్లు కూడా పొందొచ్చు. ఫ్రెండ్స్‌ను యాప్‌లోకి ఇన్వైట్‌ చేసి ఉచిత కాయిన్స్‌ సంపాదించే ఆప్షన్‌ కూడా ఉంది. స్టెప్స్‌ కౌంటింగ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా మొబైల్‌ బ్యాటరీ వినియోగాన్ని తగ్గించొచ్చు. సాధారణంగా అయితే యాప్‌ ట్రాక్‌ ఆప్షన్‌లో ఆన్‌ అయి ఉంటుంది. • యాప్‌ డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి


అడుగులకు.. కాయిన్స్‌ ఇస్తుంది

1500 అడుగులు టార్గెట్‌... దానిని సాధిస్తే రివార్డ్‌ పాయింట్లు/కాయిన్స్‌ వస్తాయి. ఇదీ ‘యోడో’ యాప్‌ కాన్సెప్ట్‌. అంతేకాదు ఈ యాప్‌లో రోజూ లాగిన్‌ అయినా కాయిన్స్‌ వస్తాయి. అలా టాస్క్‌లు చేస్తూ, యాప్‌ అడిగిన పనులు చేస్తే కాయిన్స్‌ వస్తూ ఉంటాయి. ఇలా వచ్చిన కాయిన్స్‌ను ఎక్స్‌ఛేంజీ చేసుకొని పేపాల్‌ క్యాష్‌ను పొందొచ్చు. ఈ యాప్‌ టాస్క్‌ల్లో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కో రకానికి ఒక్కో రకమైన కాయిన్స్‌ వస్తాయి. దీంతోపాటు ఇందులో హార్ట్‌రేట్‌, బ్లడ్‌ ప్రజెర్‌, బ్లడ్‌ ఆక్సిజన్‌, బ్లడ్‌ విస్కాసిటీ, బీఎంఐ, పల్స్‌వేల్స్‌ లాంటి వివరాలను పొందుపరుచుకోవచ్చు. మీ పరిసరాల్లో ఆ యాప్‌ వాడుతున్నవాళ్లు ఉన్నా చూపిస్తుంది. • యాప్‌ డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి


ఆడియో ఎలర్ట్స్‌ వస్తాయ్‌

వాకింగ్‌ పూర్తయింది.. అంటూ సెల్ఫీ తీసుకొని స్టేటస్‌లు పెట్టడం, గ్రూపుల్లో పోస్ట్‌ చేయడం లాంటివి చేస్తుంటారా? అయితే ‘రన్‌టోపియా’ యాప్‌ మీకు నచ్చుతుంది. ఇందులో కమ్యూనిటీ ట్యాబ్‌లో మీ స్నేహితుల కసరత్తుల స్టేటస్‌లు తెలుసుకోవచ్చు, మీరు కూడా పంచుకోవచ్చు. ఇక రివార్డులు ఎలానూ ఉంటాయి. వాటి వివరాలు ఇక్కడే షేర్‌ చేయొచ్చు. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి, ఖాతా తెరిచి నడిస్తే ‘స్పోర్ట్స్‌ కాయిన్స్‌’ వస్తాయి. వాటిని యాప్‌లోని షాప్‌ సెక్షన్‌లో రెడీమ్‌ చేసుకొని కూపన్లు సంపాదించొచ్చు. ఆ తర్వాత వాటితో మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఈ యాప్‌లో ఆడియో ఎలర్ట్స్‌ ఆప్షన్‌ కూడా ఉంది. రన్‌,వాక్‌, సైక్లింగ్‌ ఫీచర్లను యాప్‌ సపోర్టు చేస్తుంది. • యాప్‌ డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి


ఇవీ చదవండి...

వాట్సాప్‌ వద్దా..ఇవిగో వీటిని ప్రయత్నించండి..

2021లో ఆన్‌లైన్ భద్రత.. ఏం చేయాలంటే..!

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని