Updated : 05 May 2022 05:12 IST

Yuvraj Singh: గత రెండు ప్రపంచకప్పుల్లో భారత్‌ పరాభవానికి కారణమదే: యువరాజ్‌

ఇంటర్నెట్ డెస్క్‌: గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో టీమ్‌ఇండియా లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. భారత ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం బాధగా అనిపించిందని యువరాజ్‌ సింగ్‌ తెలిపాడు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే వరల్డ్‌ కప్‌ జట్టుల్లో సభ్యుడైన యువరాజ్ ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడాడు. ‘‘టీ20 ఫ్రాంచైజీ క్రికెట్‌లో మిడిలార్డర్ బ్యాటర్లు చాలా కీలకం. అయితే టీ20 ప్రపంచకప్‌నకు వచ్చేసరికి టీమ్‌ఇండియాకు మిడిలార్డర్‌ లోటు స్పష్టంగా కనిపించింది’’ అని వివరించాడు. న్యూజిలాండ్, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, స్కాట్లాండ్‌తోపాటు భారత్‌ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. అయితే కివీస్, పాక్‌పై ఓడిపోవడంతో సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. మిగతా మూడు జట్లపై గెలిచినా పాక్‌పై కివీస్‌ గెలవడంతో టీమ్ఇండియా గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టక తప్పలేదు.

2019 వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా తప్పిదాలపైనా యువరాజ్‌ సింగ్ స్పందించాడు. రెండు రోజులపాటు జరిగిన సెమీస్‌లో కివీస్‌పై భారత్‌ స్వల్ప తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ‘‘2011లో టీమ్ఇండియా ప్రపంచకప్‌ గెలిచేసరికి బ్యాటింగ్‌ ఆర్డర్‌ చాలా స్పష్టంగా ఉంది. అయితే 2019 వచ్చేనాటికి సరైన ప్రణాళిక లేదనిపించింది. ఓ నాలుగైదు వన్డేలను ఆడిన విజయ్‌ శంకర్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం.. అతడు విఫలం కాగానే అప్పుడే వస్తున్న యువ క్రికెటర్‌ రిషభ్ పంత్‌తో రీప్లేస్ చేయడం సరైందిగా అనిపించలేదు. నేను, కైఫ్‌, దినేశ్‌ మోంగియా 2003 ప్రపంచకప్‌నాటికే దాదాపు 50కిపైగా వన్డేలను ఆడేశాం’’ అని వివరించాడు. ధోనీ సారథ్యంలో 2011 ప్రపంచకప్‌ను గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఐసీసీ ట్రోఫీని భారత్‌ నెగ్గలేదు. ఆసీస్‌ వేదికగా జరిగే 2022 టీ20 ప్రపంచకప్‌ను రోహిత్‌ సేన సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని