Medaram 2022: వీరత్వానికి ప్రతీక సమ్మక్క

సమ్మక్కకు సంబంధించి ఒక చరిత్ర ప్రచారంలో ఉంది. క్రీస్తుశకం 1300లో మేడారం గ్రామానికి చెందిన కోయ రాజు రాయిబండాని రాజు-చందం బోయిరాలు దంపతులు ఉండేవారు....

Updated : 16 Feb 2022 14:47 IST

సమ్మక్క ప్రజల ఇలవేల్పు.. ఆదివాసీల కోసం అమ్మ చేసిన పోరాటం వీరోచితం. ఆమె త్యాగం వృథా పోలేదు.. ప్రజల గుండెల్లో శాశ్వతంగా గుడి కట్టుకున్నారు. ఎంతగా విశ్వసిస్తున్నారంటే సమ్మక్క పేరులోని మొదటి అక్షరం కలిసేలా తమ పిల్లలకు పేర్లు పెట్టుకుంటారు.

సమ్మక్కకు సంబంధించి ఒక చరిత్ర ప్రచారంలో ఉంది. క్రీస్తుశకం 1300లో మేడారం గ్రామానికి చెందిన కోయ రాజు రాయిబండాని రాజు-చందం బోయిరాలు దంపతులు ఉండేవారు.. ఓ రోజు వేటకు వెళ్లగా అడవిలో పాప కంటపడింది. చిన్నారిని ఇంటికి తీసుకొచ్చి.. మాఘశుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క అని నామకరణం చేశారు.

అందరికీ ఆప్తురాలై..

సమ్మక్క మేడారం వచ్చినప్పటి నుంచి శుభపరిణామాలే జరుగుతున్నాయి. ఆమెలో దైవలీలలు కనిపిస్తుండడంతో ప్రజలందరూ దేవతగా భావించారు. సమ్మక్కను పొలవాసకు చెందిన మేడరాజు మేనల్లుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న జన్మించారు.

యుద్ధభూమిలోకి దూకి..

స్థానికంగా ఉండే ప్రచారం ప్రకారం.. కాకతీయ రాజులకు పగిడిద్దరాజు సామంతుడిగా ఉంటూ మేడారాన్ని పాలించేవారు. వరుసగా వచ్చిన కరవు కాటకాలతో కాకతీయులకు కోయ రాజులు పన్ను కట్టలేకపోయారు. మేడారం పరగణంపై కాకతీయరాజులు యుద్ధానికి వచ్చారు. సైన్యాలతో పోరాడుతూ పగిడిద్దరాజు, ఆయన కూతుళ్లు సారలమ్మ, నాగులమ్మ, కొడుకు జంపన్న, అల్లుడు గోవిందరాజు వీరమరణం పొందారు. సమ్మక్క యుద్ధానికి సిద్ధమైంది. వీరోచిత పోరాటానికి వందలాది మంది నేలకూలారు. ఓటమి తప్పదని భావించిన సైన్యం సమ్మక్కను దొంగచాటున కత్తితో పొడిచారు.

కుంకుమ భరిణగా కనిపించి..

శత్రువుల చేతిలో చావడం ఇష్టం లేక సమ్మక్క యుద్ధ భూమి నుంచి తప్పుకొని చిలకలగుట్ట వద్దకు వచ్చింది.  గిరిజనులు ఆమె కోసం అడవిలో వెతుకుతున్న సమయంలో చిలకలగుట్టపై గల నెమలి నార చెట్టుకింద కుంకుమ భరిణ కనిపించింది. అక్కడ నుంచి సమ్మక్క మాటలు వినిపించాయి. కుంకుమ భరిణ సమ్మక్క ప్రతిరూపంగా కోయదొరలు  భావించి దేవతగా కొలుస్తున్నారు.

మాఘశుద్ధ పౌర్ణమిన..

మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క-పగిడిద్దరాజుకు వివాహం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. వీరి కల్యాణమే మహాజాతరగా అవతరించింది. చిలకల గుట్ట నుంచి అమ్మవారి ప్రతిరూపమైన కుంకుమ భరిణను పూజారులు తీసుకొస్తారు. ఈ సమయంలో మహాఘట్టం ఆవిష్కృతమవుతుంది. అడుగడుగునా భక్తులు నీరాజనాలు పడతారు. వారి జయజయధ్వానాలు దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనిస్తాయి.


తల్లికి తగ్గ తనయ సారలమ్మ  

కొత్తగూడ: సమ్మక్కకు వారసురాలిగా సారలమ్మ చేసిన యుద్ధం అజరామరం. మేడారం వైపు వస్తున్న కాకతీయ సైన్యాన్ని నియంత్రించేందుకు కోయదొరల విల్లంబులు చేతబూని సారలమ్మ ఎదురెళ్లింది. గోవిందరాజుతో కలిసి యుద్ధంలో పాల్గొంది. కన్నెపల్లి వద్ద వీరమరణం పొందింది. ఆ యుద్ధ స్థలమే నేటి సారలమ్మ నెలవు. తల్లికంటే ముందుగానే వీరమరణం పొందినందున మహాజాతర తొలి ఘట్టం కూడా సారలమ్మ ఆగమనంతోనే ప్రారంభమవుతోంది. కన్నెపల్లిలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సమీపంలోని అడవి నుంచి వెదురు కంకలను తీసుకొచ్చి ప్రత్యేకంగా బుట్ట అల్లుతారు. ఆమె ప్రతిరూపాన్ని ఆ బుట్టలో పెట్టుకుని పూజారులు మేడారానికి బయలు దేరుతారు. మేళతాళాలతో డప్పు చప్పుళ్లు, డోలి వాయిద్యాలతో అంగరంగ వైభవంగా అమ్మవారిని తరలిస్తుండగా భక్తులు పూజారుల పాదాలను తాకేందుకు ప్రాణాలను లెక్కచేయకుండా ప్రయత్నిస్తారు. గుడికి ఎదురుగా ఉన్న దారిపై మహిళలు వరం పడతారు. వీరిపై నుంచి పూజారులు నడుచుకుంటూ వెళ్తారు. సారలమ్మనే తమపై నుంచి స్వయంగా వెళ్లిందని భక్తులు అనుభూతి పొందుతారు. కొందరు మహిళలు సంతానం కోసం, మరికొందరు భక్తిపారవశ్యంతో చేస్తుంటారు. అలా జాతర ప్రారంభమయ్యే బుధవారం కొండాయి నుంచి భర్త గోవిందరాజుతో కలిసి సారలమ్మ గద్దెకు చేరుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని