Medaram Jathara: అమ్మవార్లు.. ఐశ్వర్యవంతులే..

మారుమూల కుగ్రామంలో కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మ దేవతల ఆదాయం ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఏటా పెరుగుతోంది. 

Updated : 17 Feb 2022 10:25 IST

మారుమూల కుగ్రామంలో కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మ దేవతల ఆదాయం ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఏటా పెరుగుతోంది. రెండు దశాబ్దాల కిందట జాతర నిర్వహణ, సిబ్బందికి వేతనాల చెల్లింపునకూ ఇబ్బంది ఉండేది. క్రమంగా సౌకర్యాలు కల్పించడంతో భక్తుల రాక  పెరిగింది. ఆ వెంటే ఆదాయం, ఆస్తులు పెరుగుతూ వచ్చాయి. భక్తుల కానుకలు, దాతల విరాళం, ప్రభుత్వ నిధులతో ఆలయం  అభివృద్ధి చెందింది. ప్రస్తుతం అమ్మవార్ల పేరిట రూ.కోట్ల  విలువైన ఆస్తులు ఉన్నాయి. 

ఎక్కడెక్కడ..

* వివిధ బ్యాంకుల్లో 5 కిలోల బంగారం, 300 కిలోల వెండి, రూ. 10 కోట్ల నగదు ఉంది.

* రెడ్డిగూడెంలో 28 ఎకరాల భూమి ఉంది. దీని విలువ ఎకరాకు రూ.7 లక్షల వరకు పలుకుతోంది.

* ఎదురుకోళ్ల మందిరం సమీపంలో 2 ఎకరాల స్థలం. ఎకరాకు రూ.10 లక్షలు విలువ.

* గద్దెల చుట్టుపక్కల 8 ఎకరాల భూమి ఉంది. ఇందులో దేవతల గద్దెలు, అతిథిగృహాలు, క్యూలైన్‌ నిర్మించారు.

* రెడ్డిగూడెం వెళ్లేదారిలో 10 అతిథిగృహాలు ఉన్నాయి. వీటి విలువ రూ.2 కోట్లు

* సారలమ్మ గద్దె నుంచి బయటికి వచ్చే మార్గంలో 27 గదులున్న వ్యాపార సముదాయం ఉంది. దీని విలువ రూ.3 కోట్లు.

* గద్దెల సమీపంలో రూ.2 కోట్ల విలువ చేసే కల్యాణ మండపం ఉంది. 

*  హనుమకొండలోని పాత సెంట్రల్‌జైల్‌కు ఎదురుగా సుమారు రూ.5 కోట్ల విలువైన 1000 చదరపు గజాల స్థలం ఉంది.

కాకతీయులకు సామంతరాజు పగిడిద్దరాజు. సమ్మక్కను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడూ ప్రజల పక్షమే నిలిచేవారు. ఆ కాలంలో కరవు కాటకాలు విలయతాండవం చేశాయి. రాజ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఈతిబాధలను కాకతీయ రాజుల దృష్టికి తీసుకెళ్లారు. కప్పం చెల్లించేది లేదని వారికి తేల్చిచెప్పారు. తన ప్రజలను కాపాడుకోడానికి కాకతీయులకు ఎదురుతిరిగారు. హోరాహోరీ పోరులో తీవ్రంగా గాయపడి, సైన్యం దాడి నుంచి తప్పించుకున్న పగిడిద్దరాజు గంగారం మండలం పూనుగొండ్ల అటవీప్రాంతం వైపు వచ్చారు. చివరకు యుద్ధంలో మరణం తప్పలేదు. ప్రజల గుండెల్లో వీరుడిగా చరిత్రలో నిలిచారు. అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లిన గిరిజనులకు పగిడిద్దరాజుకు సంబంధించిన చెవిపోగు పెన్క వంశీయులకు       దొరికింది. ఈ పోగును గ్రామానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో గ్రామంలో ఒకరికి పూనకం వచ్చింది. చెవిపోగును పగిడిద్దరాజుగా పూజించాలని చెప్పడంతో అప్పటి నుంచి ఆయనకు పూజలు చేస్తున్నారు.     పగిడిద్దరాజు, పెన్కవంశీయుల గొట్టుగోత్రం (సన్పగాని గోత్రం, 4వ గొట్టు) ఒకటవడంతో తమ వంశానికి చెందిన దేవుడిగా వీరు కొలుస్తున్నారు. 

దానధర్మాల్లో మేటి గోవిందరాజు

సారలమ్మ భర్త గోవిందరాజు ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిచేలా కృషి చేశారనే పేరుంది. దానాలు చేయడంలో ముందుండేవాడని పేరుంది.  గోవిందరాజు మంచితనాన్ని తెలుసుకున్న సమ్మక్క, పగిడిద్దరాజు తమ గారాలపట్టి సారలమ్మను గోవిందరాజుకిచ్చి వివాహం జరిపించారు. ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో గోవిందరాజు నెలవున్నట్లు చరిత్ర చెబుతోంది. కొండాయికి చెందిన దబ్బకట్ల వంశస్థులు గోవిందరాజును కొలుస్తున్నారు. కాకతీయ సైన్యంతో జరిగిన పోరులో వీరోచితంగా పోరాడిన గోవిందరాజు  వీరమరణం పొందారని గిరిజనుల భావన. మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతరలో పాల్గొనేందుకు గోవిందరాజును పూజారులు పడగ రూపంలో తీసుకొస్తారు. 

జంపన్న ఆత్మబలిదానం 

సమ్మక్క- పగిడిద్దరాజు దంపతుల కుమారుడు జంపన్న. రాజ్యపాలన, యుద్ధ మెలకువలన్నీ నేర్చుకున్నారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో యువరాజుగా కీర్తిగడించారు. మేడారంలోని సంపెంగ వాగు సమీపాన           యుద్ధరంగంలో కదం తొక్కారు. ఒక్కసారిగా పెద్దమొత్తంలో దూసుకొచ్చిన సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోవడాన్ని అవమానంగా భావించారు. సంపెంగ వాగులోకి  దూకి ఆత్మబలిదానం చేసుకున్నారు. - న్యూస్‌టుడే, తాడ్వాయి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని