Medaram 2022: మేడారం.. మినీభారత్‌

జాతర వచ్చిదంటే చాలు అందరి చూపు మేడారం వైపే.. వివిధ రాష్ట్రాల నుంచి అమ్మలను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. 

Updated : 17 Feb 2022 12:13 IST

జాతర వచ్చిదంటే చాలు అందరి చూపు మేడారం వైపే.. వివిధ రాష్ట్రాల నుంచి అమ్మలను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. దీంతో మేడారం కుగ్రామం మినీ భారత్‌గా మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి           తరలొస్తారు. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, రాజస్థాన్, గుజరాత్‌ తదితర ప్రాంతాలకు చెందినవారు వ్యాపారం చేస్తారు. ప్రవాసభారతీయులూ వచ్చి తీరొక్క మొక్కులు చెల్లిస్తారు. 

⇒ మేడారం.. మహాజాతరకు ముస్తాబైంది. 3000   జనాభా కలిగిన ఈ గ్రామం జాతర సమయంలో లక్షలాది మందితో మహానగరాన్ని తలపిస్తుంది.

నాలుగు రోజులపాటు  చాలా మంది గుడారాలు అద్దెకు  తీసుకొని బస చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

అతిపెద్ద బస్టాండు

భక్తుల రవాణా కోసం అతిపెద్ద బస్టాండ్‌ ఏర్పాటైంది.  వంద ఎకరాల్లో ఉంటుంది. సుమారు 3,800 వరకు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. హైదరాబాద్‌లో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ కన్నా ఎక్కువ విస్తీర్ణం, ఎక్కువ సంఖ్యలో బస్సులు ఇక్కడి నుంచి నడుస్తాయి.

దుకాణాలు

పదివేలకుపైగా దుకాణాలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. బొమ్మలు మొదలుకొంటే చరవాణుల వరకు అన్నీ  లభిస్తాయి. రెస్టారెంట్లు ఏర్పాటయ్యాయి..  రూ.కోట్లలో వ్యాపారం జరుగుతుంది.

నాలుగు లక్షలకుపైగా వాహనాలు

 ఈసారి 4.70 లక్షల ప్రైవేటు వాహనాలు వస్తాయని అధికారుల అంచనా. మేడారం పరిసర ప్రాంతాల్లో ఏకంగా 33 పార్కింగ్‌ ప్రదేశాలను సిద్ధం చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పార్కింగ్‌ ప్రాంతంగా దీనికి సరికొత్త రికార్డు ఇవ్వొచ్చు. ద్విచక్ర వాహనాలు, కార్లు, వ్యాన్లే కాదు, హెలికాప్టర్లు నడుస్తుంటాయి. ఇందుకోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్లు నిర్మించారు.

ఇక్కడి నుంచే పాలన

కలెక్టర్, ఎస్పీ మొదలుకుంటే వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మేడారంలో ఉంటారు. సుమారు 21 శాఖలు పని చేస్తుంటాయి. పాలన ఇక్కడి నుంచే సాగుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికంగా ఉంటారు. ప్రముఖులు వచ్చి పోతుంటారు. వైద్య పరంగా 100 పడకల ఆసుపత్రితో పాటు వివిధ ప్రాంతాల్లో శిబిరాలు అందుబాటులో ఉన్నాయి.

మీకు తెలుసా..

 ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర

 1968 నుంచి దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకున్నారు

 1996లో రాష్ట్ర పండగగా ప్రకటించారు

 ఇక్కడ పూజారులకు వేతనాలు ఉండవు. వాటాలు ఉంటాయి

 పూర్వంలో సమ్మక్కజాతర బయ్యక్కపేట, సారలమ్మ జాతర ఏటూరునాగారం మండలం దొడ్లలో నిర్వహించేవారు

 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది నాలుగో జాతర

 రాష్ట్రంలో ఎక్కువ హుండీలున్న జాతర ఇదే. 500పైగా ఉంటాయి

 హుండీల్లో వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా వస్తుంటుంది

 జాతర పూజలు నాలుగు బుధవారాలు నిర్వహిస్తారు. మొదటి బుధవారం సన్నద్ధత మొదలవుతుంది. రెండో వారం పూజలు ప్రారంభమవుతాయి. మూడో వారం జాతర మొదలవుతుంది. నాలుగో వారంతో జాతర ముగుస్తుంది.

 మాఘశుద్ధ పౌర్ణమికి అటు ఇటుగా వచ్చే బుధవారంతో జాతర మొదలవుతుంది

 2004 నుంచి స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. అంతకు ముందు జంపన్నవాగు ప్రవాహంలోనే స్నానాలు చేసేవారు

2016 నుంచి హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తెచ్చారు

 2018లో గిరిజన మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు

 2018 నుంచి మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు.

- ఈనాడు, వరంగల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని