Medaram 2022: జంపన్న.. శరణు!!

మహాజాతరకు జంపన్నవాగుకు విడదీయలేని బంధం ఉంది. కాకతీయులతో

Updated : 17 Feb 2022 12:14 IST

మహాజాతరకు జంపన్నవాగుకు విడదీయలేని బంధం ఉంది. కాకతీయులతో యుద్ధం జరిగిన సమయంలో రోజుల తరబడి  పోరాటం చేసిన సమ్మక్క కుమారుడు జంపన్న  మేడారం పొలిమేరలో ఉన్న సంపెంగ వాగులో దూకి ఆత్మార్పణ చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. నాటి నుంచి ప్రజలు ఆ వాగును జంపన్నవాగుగా పిలుస్తున్నారు. భక్తజనులు జంపన్నవాగులో పుణ్యస్నానమాచరించి ఆ తర్వాత తల్లుల దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చే పూజారులు, పూనుగొండ్ల నుంచి వచ్చే పగిడిద్దరాజు పూజారులు జంపన్నవాగులో దిగి నడుచుకుంటూ వచ్చి గద్దెల ప్రాంగణానికి చేరుకుంటారు. దశాబ్దాలుగా ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. 

సందడంతా అక్కడే..

వేకువజామున సూర్యుడి లేలేత కిరణాలు నేలపై ప్రసరిస్తున్న సమయంలో వాగు భక్తజనంతో నిండిపోయే దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్లు చాలవు. రాత్రి వేళ విద్యుద్దీపాల కాంతుల్లో స్నానఘట్టాలు మెరిసిపోతుంటాయి. జంపన్నవాగుకు రెండు వైపులా స్నానఘట్టాలు నిర్మించారు. వాటిపై జల్లు స్నానాలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.  సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పూనకాలతో ఊగిపోతూ హోరెత్తిస్తారు. మరో వైపు వీర గోలతో కొందరు మహిళలు భక్తుల వీపులపై చరుస్తూ భయం పోగొట్టే ప్రయత్నం చేస్తారు. వాగు ఒడ్డున పదుల సంఖ్యలో నాగ  దేవతల పుట్టలు వెలుస్తాయి. పవిత్ర స్నానాలు చేసిన అనంతరం అక్కడే నాగదేవతలకు పూజలు చేసి తల్లుల దర్శనానికి తరలివెళ్తారు.  - న్యూస్‌టుడే, గోవిందరావుపేట 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని