Medaram 2022: కాలిబాట నుంచి గాలి మోటారు వరకు..

అమ్మా బైలెల్లినామో.. తల్లీ బైలెల్లినామో.. అంటూ సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు

Published : 18 Feb 2022 12:29 IST


 ఈనాడు, వరంగల్‌: అమ్మా బైలెల్లినామో.. తల్లీ బైలెల్లినామో.. అంటూ సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి  రావడం ఆనవాయితీ. ఈ  క్రమంలో రవాణా వ్యవస్థలోనూ కీలక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు కాలినడక, ఎడ్లబండ్లపై వచ్చేవారు. ఇప్పుడు హెలికాప్టర్లలో సైతం వస్తున్నారు

> రవాణా వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఎడ్లబండ్లపై వచ్చేవారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం ప్రాంతాల నుంచి ఇంటిల్లిపాదీ నాలుగు రోజులూ మేడారంలోనే బస చేసి జాతర అయ్యాక ఎడ్లబండ్లలోనే తిరిగి వెళ్లేవారు.

> కాలం మారుతున్న కొద్దీ, అనేక రకాల వాహనాలు అందుబాటులోకి రావడం మొదలైంది. ద్విచక్రవాహనాల సంఖ్య పెరిగింది. ఆ తర్వాత ఆటోలు, కార్లు, లారీలు వచ్చేవి.

> ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండగగా ప్రకటించాక ఆర్టీసీ బస్సులను నడపడం ప్రారంభించింది.

 ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు రావడంతో రైల్వే శాఖ కూడా వరంగల్, కాజీపేటకు పలు ప్రత్యేక రైళ్లను నడపడం మొదలుపెట్టింది. సొంత వాహనాల్లో వచ్చేవారు లక్షల సంఖ్యలోనే ఉంటారు.

> 2020 జాతరలో సాధారణ భక్తుల కోసం కూడా తెలంగాణ పర్యాటక అభివృద్ధి శాఖ హెలికాప్టర్లు, జాయ్‌ రైడ్లను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర పెద్దలు, ప్రముఖులు హెలికాప్టర్‌లో వస్తుంటారు. అలా మేడారం జాతర రవాణా ప్రస్థానం కాలినడక నుంచి హెలికాప్టర్‌ వరకు సాగింది. ఎన్ని ఆధునిక రవాణా సాధనాలు వచ్చినా ఇప్పటికీ మేడారానికి కొందరు గ్రామీణులు ఎడ్లబండ్లలోనే వస్తారు.

సమ్మక్క జలపాతం.. పరమౌషధం..!

 భక్తులు అమ్మలను దర్శించుకున్న తర్వాత చిలకలగుట్ట వద్ద ఉన్న ‘సమ్మక్క జలపాతం’ వరకు వెళ్తారు. గుట్ట నుంచి జాలువారే జలాలను భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. క్యాన్లు, సీసాల్లో నింపుకొని వెంట తీసుకెళ్తారు. ఆ నీరు తాగితే వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం.  మండు వేసవిలోనూ సన్నటి ధార పోస్తూనే ఉంటుంది.-ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని