Medaram 2022: రారండోయ్‌.. ప్రకృతి అందాలు చూసొద్దాం!!

మేడారం పరిసర ప్రాంతాల్లో అనేక పర్యాటక ప్రాంతాలు  కొలువుదీరాయి. సుదూరాల 

Updated : 18 Feb 2022 14:26 IST

ఈనాడు, వరంగల్‌: మేడారం పరిసర ప్రాంతాల్లో అనేక పర్యాటక ప్రాంతాలు  కొలువుదీరాయి. సుదూరాల నుంచి వనదేవతల వద్దకు వచ్చేవారు ఆ దర్శనీయ స్థలాలనూ చూసి రావొచ్చు. మహాజాతర జరిగే నాలుగు రోజులపాటు రద్దీ దృష్ట్యా వీటిల్లో కొన్ని చోట్లకు అనుమతి ఉండదు. జాతర తర్వాతైనా ఈ ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లి వాటి అందాలు ఆస్వాదించవచ్చు.

ఆలయాల సమూహం

కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి వచ్చేవారు కోటగుళ్లను దర్శించుకొని మేడారం వెళ్లొచ్చు. కోటగుళ్లను గణపతిదేవుడు క్రీ.శ 1199-1260 మధ్య నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 12 ఆలయాల  సమూహంతో అలరించే ఈ గుళ్లు ఇప్పుడు శిథిలావస్థకు చేరాయి. కాకతీయుల శిల్ప శైలిలో ఉన్న ఎన్నో వింతలు ఇక్కడ చూడొచ్చు. 

పాండవుల గుట్టలు

పాండవుల గుట్టలు భౌగోళికంగా ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటాయి. భారీ గుట్టలు, అనేక ఆకారాలతో అలరించే వీటిపైకి ఎక్కాలంటే ఒక పూట సమయం పడుతుంది. గుట్టపైన ఆది మానవుల కాలం నాటి చిత్రాలు ఉండడం వల్ల చారిత్రకంగా దీనికి ఎంతో గుర్తింపు ఉంది. మహాభారతం సమయంలో పాండవులతో ముడిపడి ఉన్న కథ కూడా ఉండడంతో వీటికి పాండవుల గుట్టలు అనే పేరొచ్చింది. సాహసికులు క్లైంబింగ్‌ చేయడానికి ఎంతో అనువుగా ఉంది. ఇక్కడ అటవీ శాఖ వారాంతాల్లో రాక్‌ క్లైంబింగ్‌ నిర్వహిస్తోంది.

తెలంగాణ నయాగరా

 బొగత జలపాతం వీక్షించేందుకు  ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచీ యాత్రికులు వస్తారు. మేడారం జాతర సమయంలో జలపాతం తక్కువ ఉద్ధృతితో ఉంటుంది. అయినా పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఉదయం, సాయంత్రం పొగ మంచుతో ప్రకృతి రమణీయంగా మారుతుంది. భద్రాచలంతో పాటు, ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చేవారు బొగత జలపాతం సమీపం నుంచి మేడారం రావాలి. ఓ గంట లోపలికి వెళ్లి చూసి రావొచ్చు. 

శిల్ప సౌందర్యానికి విశ్వఖ్యాతి

హైదరాబాద్‌ వైపు నుంచి వచ్చేవారు రామప్ప ఆలయానికి వెళ్లవచ్చు. జంగాలపల్లి క్రాస్‌ నుంచి ఎడమవైపు తిరిగాక 7 కిలోమీటర్ల దూరంలో రామప్ప ఆలయం ఉంది. గతేడాది జులైలో యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కడంతో విశ్వఖ్యాతి గడించింది.  13వ శతాబ్దం కాకతీయుల కాలం నాటి ఈ అపురూప కట్టడం కనువిందు చేస్తుంది. 

 వంతెనల స్వర్గం..

లక్నవరం సరస్సు ప్రముఖ పర్యాటక ప్రదేశం.సరస్సులో మూడు తీగల వంతెనలు నిర్మించారు. చుట్టూ పచ్చటి కొండలు, మధ్యలో సరస్సు అందాలు చూపరులకు కనువిందు చేస్తాయి. బోటు షికారుతో పాటు అనేక రకాల సాహస క్రీడలు నిర్వహిస్తారు. 

మరికొన్ని.. కాళేశ్వరం ఆలయం, ప్రాజెక్టు, దామెర వాయి గుహలు, వేయిస్తంభాల గుడి, వరంగల్‌ కోట, భద్రకాళి బండ్, జైనుల గుట్ట లాంటి అనేక సందర్శనీయ స్థలాలు ఉన్నాయి.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని